అక్షరాల కోసం తుపాకీపై పోరాటం!

11 Oct, 2014 01:00 IST|Sakshi
అక్షరాల కోసం తుపాకీపై పోరాటం!

లండన్: ఆంక్షల రాజ్యంలో హక్కుల కోసం ఎలుగెత్తి నినదించడం అంత సులభం కాదు. ఇక చిన్నపిల్లల పరిస్థితి చెప్పనక్కర్లేదు. కానీ మలాలా అధైర్యపడలేదు. అన్నపానీయాలెంత అవసరమో, జ్ఞానం కూడా అంతే అవసరమనుకుంది ఆ చిన్నారి. తాలిబన్ల రాజ్యంలో బాలికల హక్కుల అణచివేతపై  గొంతు విప్పింది. తుపాకులు, బాంబులతో విరుచుకుపడే శత్రువులను కేవలం కలంతో, మాటలతో ప్రాణాలకు తెగించి ప్రతిఘటించింది. మతోన్మాదుల పాలనలో అక్షరాలకు దూరమైన బాలికల వెతలను ఆవేదనతో ఆర్తిగా ప్రపంచం కళ్లకు కట్టింది. ఆ అకుంఠిత పోరాటంలో శత్రువు తూటాల దాడికి గురై మృత్యువుకు చేరువదాకా వెళ్లింది. తర్వాత కూడా ఆమె వీరోచిత పోరాటం ఆగలేదు. తమ దేశంలోనే కాకుండా అణగారిన దేశాలన్నింటిలోని బాలికల హక్కుల రక్షణకు నడుం బిగించింది.
 
 ఈ కృషికి గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి ఆమె ఒడిలో వచ్చి వాలింది. ప్రపంచంలో అందరికీ తెలిసిన టీనేజర్‌గా గుర్తింపు పొందిన మలాలా యూసఫ్ జాయ్ 1997 జూలై 12నలో పాకిస్థాన్‌లోని ఖైబర్-పక్తూన్‌క్వా రాష్ట్రం స్వాత్‌లోయలోని మింగోరా పట్టణంలో సున్నీ ముస్లింల కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి  జియావుద్దీన్ స్కూలు యజమాని. విద్యాహక్కు కార్యకర్త. మలాలా ఆయన స్కూల్లోనే చదువుకుంది. 2007 నుంచి 2012 వరకు స్వాత్ లోయలోని పలు ప్రాంతాల్లో తాలిబన్ల నిరంకుశ పాలన సాగింది. ఉగ్రవాదులు టీవీలు, సినిమాలు, పుస్తకాలపై నిషేధం విధించారు. బాలికలు చదువుకోకూడదంటూ వారి పాఠశాలలను పేల్చేశారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో మలాలా గొంతువిప్పింది. 2008లో పెషావర్ సభలో ‘విద్య నా ప్రాథమిక హక్కు. దాన్ని లాగేసుకోవడానికి తాలిబన్లకు ఎంత ధైర్యం?’ అని మండిపడింది. 2009లో 12 ఏళ్ల వయసులో బీబీసీ బ్లాగులో గుల్ మకాల్ అనే పేరుతో స్వాత్ బాలికల దయనీయ స్థితిని వివరించింది.  మీడియాఇంటర్వ్యూల్లో తాలిబన్లపై నిప్పులు చెరిగింది.
 
 తలలోకూ తూటా.. :మలాలా పోరాటాన్ని తాలిబన్లు సహించలేకపోయారు. 2012 అక్టోబర్ 9న స్కూలుకు వెళ్తుండగా ఓ మిలిటెంట్ ఆమెపై మూడు తూటాలు పేల్చాడు. ఒకటి ఆమె తలలోకి దూసుకెళ్లి భుజం దాకా వెళ్లింది. ఆ ప్రాణాంతక గాయానికి మెరుగైన చికిత్స కోసం ఆమెను బ్రిటన్‌కు తరలించారు. చికిత్సతో కోలుకున్న మలాలా ప్రస్తుతం బర్మింగ్‌హామ్ స్కూల్లో చదువుకుంటోంది. పాక్‌కు వస్తే చంపుతామని తాలిబన్లు బెదిరించడంలో మలాలా కుటుంబం బ్రిటన్‌లోనే ఉంటోంది. ఐక్యరాజ్య సమితితో కలిసి విద్యా హక్కుకోసం పోరాడుతోంది. యూరోపియన్ యూనియన్ మానవ హక్కుల అవార్డు, పాకిస్థాన్ యువ శాంతి పురుస్కారం వంటి ఎన్నో అవార్డులు అందుకుంది. ‘ఐయామ్ మలాలా’ పేరుతో గత ఏడాది ఆత్మకథను వెలువరించింది. ‘‘ఉగ్రవాదులు నేను మారతాననుకున్నారు. వారి దాడితో నాలో బలహీనత, భయం పోవడం తప్ప నా జీవితంలో ఎలాంటి మార్పూ రాలేదు. నేను తాలిబ్(తాలిబన్ మిలిటెంట్)ను ద్వేషించడం లేదు. అతడు ఎదురుగా నిలబడితే నా చేతిలో తుపాకీ ఉన్నా కాల్చను’’ అని ఐరాసలో గత ఏడాది ఉద్వేగంగా చెప్పిన మలాలా నిజంగా శాంతదూతే.
 

మరిన్ని వార్తలు