ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు: జైట్లీ

9 Feb, 2017 20:08 IST|Sakshi
ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు: జైట్లీ
న్యూఢిల్లీ : విజయ్ మాల్యా వ్యవహారంలో ఎన్డీయే ప్రభుత్వం, ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్రస్థాయిల్లో ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. మాల్యాకు లబ్ది మీరు చేకూర్చారంటే, మీరే రుణాలు ఇచ్చారంటూ వాదించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం లోక్ సభలో జరిగిన చర్చా కార్యక్రమంలో మోదీ ప్రభుత్వం విజయమాల్యాకు ఒక్క రూపాయి లబ్ది కూడా చేకూర్చలేదని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంచేశారు. యూపీఏ పాలనలోనే నార్త్ బ్లాక్ జోక్యంతో వ్యాపారస్తులకు భారీగా రుణాలు మంజూరు చేశారని ఆరోపించారు. లోక్సభలో జరిగిన చర్చ కార్యక్రమంలో రుణాల విషయాలపై అరుణ్ జైట్లీ ఘాటుగా సమాధానాలిచ్చారు.  గత ప్రభుత్వమే బ్యాంకుల్లో స్థూల నిరర్థక ఆస్తులకు భారీగా మినహాయింపులు ఇచ్చిందని మండిపడ్డారు.
 
అడ్డుఅదుపు లేకుండా విచక్షణా రహితంగా కొంతమంది వ్యక్తులకు, పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరు చేసిందని చెప్పారు. ఎన్పీఏలకు మూల కారణం గత యూపీఏ ప్రభుత్వమేనని  ఆరోపించారు. వారి దుశ్చర్యలకు తాము భరించాల్సి వస్తుందని వాపోయారు. ప్రస్తుత ప్రభుత్వం విజయ్మాల్యాకు రూ.1,200 కోట్ల లబ్ది చేకూర్చిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ ఆరోపణలపై స్పందించిన జైట్లీ, 2016 మేలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం ఒక్క రూపాయి లబ్ది కూడా మాల్యాకు  అందించలేదని స్పష్టీకరించారు. 2016 సెప్టెంబర్ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎన్పీఏలు రూ.6,30,323 కోట్లగా ఉన్నాయి. 
 
మరిన్ని వార్తలు