మాయావతి ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలి

16 Mar, 2017 14:25 IST|Sakshi
మాయావతి ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలి

బీఎస్పీ అధినేత్రి మాయావతి కోర్టుకు వెళ్లినా ఇంకెక్కడికి వెళ్లినా పర్వాలేదని, కానీ అంతకంటే ముందు ఆమె ఒకసారి ఆస్పత్రికి వెళ్లి చూపించుకుంటే మంచిదని బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య విమర్శించారు. యూపీ ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని, దానివల్ల ఎవరికి ఓటేసినా బీజేపీకే ఓట్లు పడ్డాయని మాయావతి ఆరోపించిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇతర పార్టీలకు ఓట‍్లు వేస్తే అసలు ఈవీఎంలు స్పందించలేదని, లేదా ఆ ఓట్లన్నీ కూడా బీజేపీకి వెళ్లిపోయాయని.. అందుకే ముస్లిం ఓట్లు కూడా బీజేపీకి పడ్డాయని మాయావతి అన్నారు.

అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు కొంతమంది ముస్లిం పెద్దలు, కొన్ని సంస్థలు బాహాటంగా బీఎస్పీకి మద్దతు పలికాయని, కానీ వాళ్ల ఓట్లేవీ తమకు పడలేదని.. అందుకే కేవలం 19 స్థానాలు మాత్రమే వచ్చాయని మాయావతి ఆవేదన చెందుతున్నరు. బీఎస్పీని స్థాపించిన తర్వాత ఇప్పటివరకు యూపీ ఎన్నికల్లో వాళ్లకు ఇంత తక్కువ సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు రావడం ఇదే మొదటిసారి. బీఎస్పీ నుంచి 100 మంది ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినా, ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న 77 నియోజకవర్గాలకు గాను కేవలం నాలుగుచోట్ల మాత్రమే బీఎస్పీ అభ్యర్థులు గెలిచారు. ఈ నేపథ్యంలో మాయావతి విమర్శించగా.. దానికి కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా దీటుగా స్పందించారు.

>
మరిన్ని వార్తలు