మెడికోపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చైన్ స్నాచర్లు

14 Nov, 2013 05:45 IST|Sakshi
మెడికోపై పెట్రోల్ పోసి నిప్పంటించిన చైన్ స్నాచర్లు

కోలారు (కర్ణాటక)/హైదరాబాద్/కల్వకుర్తి న్యూస్‌లైన్: కోలారులో ఓ వైద్యవిద్యార్థిపై ఇద్దరు చైన్ స్నాచర్లు ఘోరమైన దాడికి పాల్పడ్డారు. మెడలోని గొలుసు లాగడానికి ఆ దుండగులు ప్రయత్నించగా ఆ మెడికో ప్రతిఘటించడంతో పెట్రోలు పోసి నిప్పంటించి సజీవ దహనానికి ప్రయత్నించారు. ఈ దారుణం కోలారు సమీపంలోని దేవరాజ్ అర్స్ వైద్య కళాశాల వద్ద మంగళవారం రాత్రి జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కామేశ్వర సాయిప్రసాద్ (22) మెడిసిన్ ఫైనలియర్ చదువుతున్నాడు. రాత్రి 10.30 సమయంలో దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా, ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండుగులు అతడి మెడలో గొలుసును లాగడానికి ప్రయత్నించారు. కామేశ్వర్ ప్రతిఘటించడంతో దుండగులు అతనిపై పెట్రోలు పోసి నిప్పంటించి పరారయ్యారు. స్థానికులు వెంటనే మంటలు ఆర్పి, దగ్గరలోని జాలప్ప ఆస్పత్రికి తరలించారు. తర్వాత కామేశ్వర్‌ను బెంగుళూరులోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ 70 శాతం గాయాలతో అతను మృత్యువుతో పోరాడుతున్నాడు. తండ్రి వెల్లంకి లక్ష్మణ శర్మ, తల్లి జ్యోతి, సోదరి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
 
 తల్లి జ్యోతి మీడియాతో మాట్లాడుతూ తమ బిడ్డకు శత్రువులు లేరని, ఎవరిపైనా అనుమానం లేదని చెప్పారు. ఇదే విషయాన్ని అతని సహచర విద్యార్థులు కూడా తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన  బాధితుడి తల్లిదండ్రులు జ్యోతి, లక్ష్మణశర్మ న్యాయవాదులుగా పనిచేస్తున్నారు. లక్ష్మణ శర్మ కల్వకుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కాగా, జ్యోతి రాష్ట్ర హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగుతూ మారేడ్‌పల్లిలో నివాసం ఉంటున్నారు. కామేశ్వర్‌పై దాడితో మారేడ్‌పల్లిలో విషాదఛాయలు అలముకున్నాయి. రాజకీయాలపై కామేశ్వర్‌కు ఆసక్తి లేదని, ఈ సంఘటనను రాజకీయాలతో ముడిపెట్టడం సరికాదని కామేశ్వర్ దగ్గర బంధువు చెప్పారు. దాడిని ఖండిస్తూ టీజేఏసీ, టీజీవీపీలు కల్వకుర్తిలో ర్యాలీ నిర్వహించాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టామని కోలారు జిల్లా ఎస్పీ తెలిపారు.
 

మరిన్ని వార్తలు