ఉగ్రవాదుల బరితెగింపు..

28 Apr, 2017 15:41 IST|Sakshi
ఉగ్రవాదుల బరితెగింపు..
- కొత్త నోట్ల కోసం బ్యాంకు దోపిడీ యత్నం
అనంతనాగ్: పాత నోట్ల రద్దు..ఉగ్రవాద,తీవ్రవాద కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలిగించిందన్న మాట నిజమని మరోసారి రుజువైంది. తమ కార్యక్రమాల విస్తరణ కోసం కొత్త నోట్లు అవసరమైన ఉగ్ర సంస్థలు ఏకంగా బ్యాంకులనే టార్గెట్ చేసుకున్నాయి. శుక్రవారం కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో చోటుచేసుకున్న దోపిడీ యత్నం ఉగ్రవాదుల బరితెగింపును వెలుగులోకి తెచ్చేదిలా ఉంది. నోట్ల రద్దు తర్వాత కశ్మీర్ లోని బ్యాంకులపై జరిగిన ఐదో  దాడి ఇది.
 
అనంత్ నాగ్ జిల్లా కేంద్రంలోని ఒక బ్యాంకును కొట్టగొట్టేందుకు సాయుధ ఉగ్రవాదులు ప్రయత్నించారు. అయితే పోలీసులు సకాలంలో స్పందించడంతో ముష్కరులు తోకముడవక తప్పలేదు. బ్యాంకులోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకడిని చెరపట్టగా, మరొకడు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పలుమార్లు తుపాకి పేలుళ్లు చోటుచేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దోపిడీ యత్నం చేసిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారనేది తెలియాల్సిఉంది.
 
కాగా, జనవరిలో ఇదే అనంత్ నాగ్ పట్టణంలో దుండగులు ఎటీఎంను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్ బ్యాంక్ కు చెందిన ఆ ఏటీఎంలో రూ.14 లక్షలు ఉన్నట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. ఇలాంటివే మరో రెండు ఘటనలూ చోటుచేసుకున్దేనాయి. ఆ కేసుల దర్యాప్తు జరుగుతుండగానే నేడు మరో దోపిడీ ఘటన చోటుచేసుకోవడం కశ్మీర్ లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతాప్రమాణాలపై అనుమానాలు రేకెత్తించేవిగా ఉన్నాయి.
మరిన్ని వార్తలు