విజయమా? వీర స్వర్గమా?

16 Oct, 2015 00:55 IST|Sakshi
విజయమా? వీర స్వర్గమా?

బిహార్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న పార్టీలు  ఈ విజయం అన్ని పార్టీలకు అత్యవసరం
దేశ రాజకీయాలు, ముఖ్యంగా ఎన్నికల రాజకీయాలు భవిష్యత్తులో ఏ దిశగా సాగనున్నాయనే విషయాన్ని అర్థం చేసుకునేందుకు బిహార్ ఎన్నికలు అవకాశం కల్పిస్తున్నాయి. జాతీయ రాజకీయాలు, మోదీ, బీజేపీ రాజకీయ భవిష్యత్తు.. మొదలైన వాటిపై ఈ ఎన్నికలు గణనీయ ప్రభావం చూపనున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల నాటి కాంగ్రెస్‌పై వ్యతిరేకత, మోదీపై సానుకూలత ఈ ఎన్నికల్లో ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు.

మోదీ గాలి, గుజరాత్ అభివృద్ధి మోడల్ మొదలైన అంశాలు మరుగునపడ్డాయి. అదీ కాక, లోక్‌సభ ఎన్నికల సమయంలో మోదీ ఇచ్చిన హామీలకు, అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలుకు మధ్య అంతరం స్పష్టం గా కనిపిస్తోంది. నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకత, మోదీపై తొలగిన భ్రమలు.. ఈ రెండు ఓటర్లపై సమాన ప్రభావం చూపుతున్నాయి. మోదీ ఇటీవల ప్రకటించిన రూ. 1.25 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కూడా ఓటర్లపై ప్రభావం చూపలేకపోయింది.
 
ప్రగతి వర్సెస్ సంక్షేమం..
మరో కోణంలో చూస్తే.. గత మూడు దశాబ్దాలుగా బిహార్ రాజకీయాలను శాసిస్తున్న సామాజిక న్యాయం, సామాజిక సాధికారతలను సవాలు చేస్తూ.. ఆర్థిక వృద్ధి, పెట్టుబడులు, సుపరిపాలన తదితర అంశాలు కొత్తగా తెరపైకి వచ్చాయి. వీటిని ఆకాంక్షిస్తున్న కొత్త వర్గం పుట్టుకొచ్చింది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి పథంలో, పెట్టుబడుల ప్రవాహంలో బిహార్ ఆర్థిక వ్యవస్థను కూడా కలుపుకోవడం మోదీ నాయకత్వంలోనే సాధ్యమవుతుందన్న వాదనతో బీజేపీ ఒకవైపు..

మెరుగైన విద్య, వైద్యం, పటిష్టమైన ప్రజా పంపిణీ, ఇతర సంక్షేమ పథకాలు, సుపరిపాలనను నమ్ముకున్న నితీశ్ నేతృత్వంలోని లౌకిక కూటమి మరోవైపు ఎన్నికల పోరులో నిలిచాయి. వీటితో పాటు విద్యార్థినులకు సైకిళ్లు, శానిటరీ నేప్కిన్స్ ఇవ్వడం లాంటి ప్రజాకర్షక పథకాలతో నితీశ్ వివిధ వర్గాల ప్రజల్లో అభిమానం సంపాదించుకున్నారు. వేగవంతమైన అభివృద్ధి, అత్యాధునిక మౌలిక వసతులు మొదలైన వాటితో దశాబ్దాల బిహార్ వెనకబాటుతనాన్ని రూపుమాపుతామన్న బీజేపీ వైపు బిహార్ ఓటర్లు మొగ్గు చూపుతారో.. లేక ప్రజాకర్షక, సంక్షేమ పథకాలను నమ్ముకున్న లౌకిక కూటమి వెంట నడుస్తారో వేచి చూడాలి.
 
కొత్త సామాజిక సమీకరణాలు..
బిహార్ ఎన్నికలతో వెలుగులోకి వచ్చిన మరో కొత్త కోణం.. మారుతున్న సామాజిక సమీకరణాలు. కొత్త సామాజిక వర్గాల ఆవిర్భావం. ఈ సమీకరణాలను అర్థం చేసుకుని, కొత్త వర్గాలను ఆకట్టుకోవడం పైననే ఇరు కూటముల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో ఓబీసీలు, ముస్లింలు, దళితుల్లో అంతర్గత విభజన జరుగుతూ కొత్త వర్గాలు రూపొందుతున్న క్రమంలో ఉన్న సమయంలోనే.. బిహార్లో ఆ విభజన స్పష్టమైన రూపు తీసుకుంది.

అలాగే, ఆ చీలిక వర్గాలు ఈ ఎన్నికల్లో స్పష్టమైన ప్రభావం కూడా చూపుతున్నాయి. ఓబీసీల్లో ఈబీసీ(ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు), ఎంబీసీ(అత్యంత వెనుకబడిన వర్గాలు).. దళితుల్లో మహా దళితులు.. ముస్లింలలో పస్మండ ముస్లింలు ఈ కేటగిరీల్లోకి వస్తారు. వీరి ఓట్ల కోసం పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చూసినా ఈ ఎన్నికలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే భవిష్యత్ ఎన్నికలకు దిశానిర్దేశం చేస్తున్నాయి.
 
అగ్రకులాలా? అణగారిన వర్గాలా?
ముస్లింలు, యాదవులు, ఈబీసీలు, మహాదళితుల ఓట్లు లక్ష్యంగా లౌకికకూటమి పావులు కదుపుతుండగా.. అగ్రకులాలపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. మాజీ సీఎం మాంఝీ, కేంద్రమంత్రి పాశ్వాన్‌ల మద్దతుతో మహాదళితుల ఓట్లు కూడా తమ ఖాతాలోకే వస్తాయని బీజేపీ ఆశిస్తోంది. ఎంఐఎం పార్టీ ప్రవేశంతో ముస్లిం ఓట్లు చీలుతాయనుకుంటోంది. యాదవుల ఓట్లపైనా కన్నేసి 30 స్థానాల్లో యాదవులను నిలిపింది.

మోదీ కూడా యదువంశీయులంటూ యాదవులను మంచి చేసుకునేందుకు ప్రయత్నించారు. హిందువుల ఓట్లు లక్ష్యంగా, మత ప్రాతిపదికన ఓటర్లను చీల్చే వ్యూహంతో ముస్లింలెవరికీ టికెట్లివ్వలేదు. రిజర్వేషన్లను సమీక్షించాలన్న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్య కూడా అగ్రకులాల ఓట్ల విషయంలో తమకు అనుకూలిస్తుందని బీజేపీ భావిస్తోంది. అయితే, అదే వ్యాఖ్యను లౌకిక కూటమి తనకు అనుకూలంగా మల్చుకుంది.  
 
అవినీతి, యువత, సాగు ఊసు లేదు
ఈ ఎన్నికలను, ఓటర్లను, ఓటింగ్ సరళిని ప్రభావితం చేసే అంశాలను పక్కనబెడితే.. పార్టీలు పట్టించుకోకుండా వదిలేసిన ముఖ్యమైన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి అవినీతి, యువత, వ్యవసాయం మొదలైనవి. అవినీతి మరకలు రెండు కూటములపైనా ఉన్నాయి. యువత ప్రత్యేక ఓటుబ్యాంకుగా రూపొందకపోవడంతో ఆ వర్గాన్ని పార్టీలు పట్టించుకోవడం లేదు.

ఒకరకంగా ఈ ఎన్నికలు ‘మోదీ వర్సెస్ నితీశ్’గా మారాయి. వారిద్దరి వ్యక్తిత్వాలు, పనితీరు, నాయకత్వ లక్షణాలు కూడా కొంతవరకు ఓటర్లను ప్రభావితం చేస్తాయి.  లౌకిక కూటమి ఓటమి పాలైతే.. ఆర్జేడీకి, కాంగ్రెస్‌కు బిహార్లో దారులు మూసుకుపోయినట్లే. జేడీయూకు కూడా కష్టకాలమే. బీజేపీ ఓడితే.. జాతీయ స్థాయిలో ఆ పార్టీకి అది పెద్దదెబ్బ అవుతుంది. వ్యక్తిగతంగా మోదీ ఇమేజ్ దారుణంగా దెబ్బతింటుంది. శత్రుపక్షాలకు ఆసరాగా నిలుస్తుంది.
(రాజకీయ, ఎన్నికల అధ్యయన సంస్థ పీపుల్స్ పల్స్ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు