ఆ క్రికెటర్‌ దళితుడు కావడం వల్లే!

28 Dec, 2016 13:21 IST|Sakshi
ఆ క్రికెటర్‌ దళితుడు కావడం వల్లే!
  • బీజేపీ ఎంపీ వివాదాస్పద ట్వీట్‌
  • ఘాటుగా స్పందించిన క్రికెటర్‌ కాంబ్లీ
     
  • న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ, దళిత ప్రముఖుడు అయిన ఉదిత్‌ రాజ్‌ తాజాగా మరో వివాదానికి తెరతీశారు. మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లి దళితుడు కావడం వల్లే.. ఆయన క్రికెట్‌ నుంచి కనుమరుగు అయ్యారని దుమారం రేపారు. 'దళితుడినని ఒప్పుకోవడంలో వినోద్‌ కాంబ్లీ సిగ్గుపడకూడదు. అలాగే.. క్రికెట్‌ నుంచి ఆయన కనుమరుగు కావడానికి అదే కారణం కూడా..' అని ఉదిత్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై క్రికెటర్‌ కాంబ్లి ఘాటుగా సమాధానమిచ్చారు. తన కులానికి, క్రికెట్‌ కెరీర్‌కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. 'మిస్టర్‌ రాజ్‌..మీ ప్రకటనలను నేను సమర్థించడం లేదు. కాబట్టి దయచేసి నా పేరును ఇకముందు ఉపయోగించకండి' అంటూ బదులిచ్చారు.

    అయితే, ట్విట్టర్‌లో బీజేపీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌ తీరుపై విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మానసిక పరిస్థితి సరిగ్గా ఉన్నట్టు లేదని ఒక నెటిజన్‌ ట్వీట్‌ చేయగా.. కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మరొకరు ట్విట్టర్‌లో ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.

    సచిన్‌ టెండూల్కర్‌, అతని చిన్ననాటి స్నేహితుడైన వినోద్‌ కాంబ్లీ ఒకేసారి క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటికీ, సచిన్‌ తరహాలో క్రికెట్‌లో కాంబ్లి నిలదొక్కుకోలేకపోయిన సంగతి తెలిసిందే. తన ఆటతీరుతో సచిన్‌ అగ్రస్థానంలోకి దూసుకెళ్లగా.. అనతికాలంలోనే జాతీయజట్టు నుంచి కాంబ్లీ కనుమరుగయ్యాడు.

>
మరిన్ని వార్తలు