ధోనీ భార్య.. కేంద్ర మంత్రి.. ఓ ఆధార్ వివాదం!

29 Mar, 2017 09:15 IST|Sakshi
ధోనీ భార్య.. కేంద్ర మంత్రి.. ఓ ఆధార్ వివాదం!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన ఆధార్ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకున్నాడు. ఇందుకోసం ఆయన సీఎస్‌సీ (కామన్ సర్వీసెస్ సెంటర్) వాళ్ల సేవలు వినియోగించుకున్నాడు. ఆ విభాగం వాళ్లు దాన్ని ఫొటో తీసుకుని ప్రచారం చేసుకున్నారు. అంతవరకు అంతా బాగానే ఉంది. కానీ, ధోనీ ఫొటోతో పాటు.. ఆయన దరఖాస్తు ఫొటో్ కూడా వాళ్లు ట్వీట్ చేయడంతో ధోనీ భార్య సాక్షి సింగ్‌కు ఎక్కడలేని కోపం వచ్చింది. తమ వ్యక్తిగత సమాచారం మొత్తాన్ని బహిరంగపరిచే హక్కు ఎవరిచ్చారంటూ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేశారు. దానికి ప్రసాద్ కూడా వెంటనే స్పందించారు. మంత్రిగారు కూడా ధోనీ తన ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకుంటున్న ఫొటోను ట్వీట్ చేశారు. దాంతో సాక్షిసింగ్ రావత్ ఆయన్ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు.

దానికి మంత్రి వెంటనే స్పందించారు. తాను పెట్టిన ఫొటోలో వ్యక్తిగత సమాచారం ఏముందని ప్రశ్నించారు. అప్పుడు.. సీఎస్‌సీ ఈగవర్నెన్స్ వాళ్లు చేసిన ట్వీట్‌లో ధోనీ దరఖాస్తు ఉన్న విషయాన్ని స్క్రీన్ షాట్ తీసి మరీ సాక్షి సింగ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంలో రవిశంకర్ ప్రసాద్, సాక్షి సింగ్‌ల మధ్య వరుసపెట్టి ట్వీట్ల జోరు కొనసాగింది. వెంటనే ఆ విషయాన్ని గమనించిన మంత్రి.. ఆ శాఖ చేసిన తప్పును గ్రహించి, తగిన చర్యలు తీసుకుంటామని సాక్షి సింగ్‌కు హామీ ఇచ్చారు. విషయాన్ని తన దృష్టికి తెచ్చినందుకు థాంక్స్ చెప్పారు. వ్యక్తిగత సమాచారాన్ని బయట పెట్టడం నేరమని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని అన్నారు. దాంతో ఆమె కూడా శాంతించి, తగిన సమాధానం ఇచ్చినందుకు మంత్రిగారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలియగానే సీఎస్‌సీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ధోనీ అప్లికేషన్ కనిపించే ఫొటోను డిలీట్ చేసేశారు.

 

మరిన్ని వార్తలు