ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

5 Aug, 2015 01:02 IST|Sakshi
ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ ఆందోళన
ప్లకార్డులు, నినాదాలతో వెల్‌లో నిరసన
కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటనకు డిమాండ్
రాష్ట్రానికి అన్యాయం చేయబోమంటూ హోంమంత్రి ప్రకటన
ఆందోళన కొనసాగించిన ఎంపీలు

 
న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ లోక్‌సభలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. మంగళవారం ఉదయం పార్టీ విప్ వైవీ సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై సభలో చర్చించేందుకు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అయితే దీనిని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించారు. దీంతో పార్టీ లోక్‌సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, వి.వరప్రసాదరావు, వై.ఎస్.అవినాశ్ రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి ప్లకార్డులు చేతబట్టి పెద్దపెట్టున నినాదాలతో వెల్‌లోకి దూసుకెళ్లారు. ‘పార్లమెంటులో ఇచ్చిన హామీ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి’ అన్న నినాదంతో ప్లకార్డులు ప్రదర్శించారు. ‘వుయ్ డిమాండ్ స్పెషల్ స్టేటస్ ఫర్ ఏపీ’ అంటూ నినాదాలు చేశారు. వెంటనే స్పీకర్ స్పందిస్తూ.. జీరో అవర్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. అయినప్పటికీ వైఎస్సార్‌సీపీ సభ్యులు అక్కడే ఆందోళన కొనసాగించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళనపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పందించి 11.30 గంటల ప్రాంతంలో ప్రకటన చేశారు. ‘ఏపీకి ఈ విషయంలో అన్యాయం జరగనివ్వబోం. మేం భరోసా ఇస్తున్నాం. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కేంద్రం అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. ఏపీకి అన్యాయం జరగనివ్వబోం’ అని పేర్కొన్నారు. హోంమంత్రి ప్రకటనతో సంతృప్తిచెందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు వెల్‌లోనే ఆందోళన కొనసాగించారు.  

 కేంద్రాన్ని నిలదీసిన మేకపాటి
 జీరో అవర్‌లో మేకపాటి మాట్లాడుతూ.. ‘ఏపీ పునర్ వ్యవస్థీకరణ బిల్లును మేం తీవ్రంగా వ్యతిరేకించాం. మమ్మల్ని సస్పెండ్ చేసి బిల్లును ఆమోదించుకున్నారు. బిల్లుపై చర్చ సందర్భంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పెషల్ స్టేటస్‌పై రాజ్యసభలో హామీ ఇచ్చారు. అప్పుడు ప్రతిపక్ష నేతలు అరుణ్‌జైట్లీ, వెంకయ్య పదేళ్లపాటు ఆ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక పదేళ్లు స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ నేతలన్నారు. ఎన్డీఏ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశం ఉంది. అధికారంలోకి వచ్చారు గానీ హోదా ఇవ్వలేదు. విభజన అనంతరం ఏపీ కష్టాల్లో పడింది. రాజధాని లేదు. భవనాలు లేవు. ఆర్థిక లోటు తీవ్రంగా ఉంది. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం పారిశ్రామికంగా నిలదొక్కుకుంటుందని ఆశించాం. కేంద్ర ప్రభుత్వంలోని కొందరు హోదా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. మరికొందరు పరిశీలనలో ఉందంటున్నారు. ఈ మధ్యనే ప్రణాళిక మంత్రి ఇందర్‌జిత్ సింగ్ కొత్తగా రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చే ప్రశ్నేతలెత్తదని స్పష్టం చేశారు. దీంతో ప్రజలు ఆందోళన బాట పట్టారు. మేమెప్పటికీ చట్టాన్ని, నిబంధనల్ని గౌరవించేవారమే. కానీ మేం వెల్‌లోకి వచ్చి నినాదాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. హోదా రాకపోతే మా రాష్ట్ర ప్రజలు మమ్మల్ని క్షమించరు. అందువల్ల మేము వారి హక్కుల కోసం, మా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ నిల్చున్నాం. తక్షణమే ప్రత్యేక హోదా అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందువల్ల త్వరగా స్పెషల్ స్టేటస్ ప్రకటించండి. మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన ప్రకటన కావాలి. లేదంటే మేం ప్రజలకు ముఖాలు చూపించలేం’ అని అన్నారు. అనంతరం ఎంపీలు ఆందోళన కొనసాగించారు. టీడీపీ ఎంపీ అవంతీ శ్రీనివాస్‌రావు కూడా జీరో అవర్‌లో స్పెషల్ స్టేటస్ డిమాండ్‌ను ప్రస్తావించారు.  

 బిల్లులో లేనందున క్లిష్టంగా మారింది..
 జీరో అవర్‌లోనే స్పెషల్ స్టేటస్ డిమాండ్‌పై కేంద్ర మంత్రి వెంకయ్య స్పందిస్తూ ‘హోదా అంశం ఆర్థిక మంత్రి పరిశీలనలో ఉంది. విభజన చట్టంలో ఈ అంశం లేకపోవడం వల్ల క్లిష్టంగా మారింది. ఆర్థిక మంత్రి దీనిని లోతుగా పరిశీలిస్తున్నారు..’ అని పేర్కొన్నారు. వెంకయ్య ప్రకటన అనంతరం కూడా వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దాదాపు రెండు గంటలపాటు వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన కొనసాగిన తరువాత స్పీకర్ సభను మధ్యాహ్నం ఒంటి గంటకు వాయిదా వేశారు. ఈ సమయంలో స్పీకర్ వైఎస్సార్‌సీపీ సభ్యులను తన చాంబర్‌కు పిలిచి మాట్లాడారు. ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం తరపున ఇద్దరు మంత్రులు సమాధానం ఇచ్చినందున వారికి మరికొంత సమయం ఇస్తే మంచిదని హితవు పలికారు. ఈ వివరాలను మేకపాటి, సహచర ఎంపీలు పార్లమెంటు భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. స్పీకర్ సూచనకు అనుగుణంగా కొంత సమయం వేచిచూస్తామని చెప్పారు.
 

>
మరిన్ని వార్తలు