మోదీ-జింగ్‌పింగ్‌ భేటీ.. ఏం చర్చించారంటే!

4 Sep, 2016 09:22 IST|Sakshi
మోదీ-జింగ్‌పింగ్‌ భేటీ.. ఏం చర్చించారంటే!

హంగ్‌ఝౌ: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్‌ ఆదివారం భేటీ అయ్యారు. చైనాలోని హంగ్‌ఝౌ నగరంలో జరుగుతున్న జీ-20 సదస్సు సందర్భంగా జరిగిన వీరి భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

అణు సరఫరాదారుల బృందం (ఎన్‌ఎస్‌జీ)లో భారత్‌ స్వభ్యత్వం, ఉగ్రవాదంపై చైనా వైఖరి తదితర అంశాలను వీరి భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. ఎన్‌ఎస్‌జీలో భారత్‌  స్వభ్యత్యానికి చైనా మోకాలడ్డుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా జేఈడీ చీఫ్‌, ఉగ్రవాది మసూద్‌ అజర్‌కు వ్యతిరేకంగా ఐరాసలో భారత్‌ ప్రతిపాదించిన తీర్మానాన్ని వీటో చేసి చైనా భారత్‌కు ఆగ్రహం కలిగించింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల సంబంధాలు, ఘర్షణాత్మక అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. జీ-20 సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచంలోని 20 అగ్రరాజ్యాల దేశాధినేతలు హంగ్‌ఝౌ  నగరానికి చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, బ్రిటన్‌ కొత్త ప్రధాని థెరిసా మే తదితరులు ఈ సదస్సులో పాల్గొననున్నారు.

సైన్స్‌ సిటీగా పేరొందిన హంగ్‌ఝౌలో రెండురోజుల పాటు జీ-20 సదస్సు జరగనుంది. ఆదివారం మధ్యాహ్నం లాంఛనంగా ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత దేశాధినేతలకు విందు కార్యక్రమం ఉంటుంది.

మరిన్ని వార్తలు