చైనాతో యుద్ధంలో..అమెరికా సాయం కోరిన నెహ్రూ!

15 Oct, 2015 01:47 IST|Sakshi
చైనాతో యుద్ధంలో..అమెరికా సాయం కోరిన నెహ్రూ!

సీఐఏ మాజీ అధికారి బ్రూస్ రీడెల్ వెల్లడి
వాషింగ్టన్: దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1962 చైనాతో యుద్ధం సమయంలో అమెరికా సహాయాన్ని కోరారని సీఐఏ మాజీ అధికారి ఒకరు వెల్లడించారు. చైనా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు యుద్ధ విమానాలను పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అప్పటి యూఎస్ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీకి లేఖ రాశారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను సీఐఏ మాజీ అధికారి బ్రూస్ రీడెల్ తన ‘జేఎఫ్‌కే-ఫర్‌గాటన్ క్రైసిస్: టిబెట్, ది సీఐఏ అండ్ సినో-ఇండియన్ వార్’ పుస్తకంలో వెల్లడించారు.

తృతీయ ప్రపంచ దేశాల్లో తిరుగులేని నేతగా నెహ్రూ ఎదుగుదలను అడ్డుకోవటానికే 1962 సెప్టెంబర్‌లో మావో ఆ యుద్ధానికి పూనుకున్నాడని బ్రూస్ పేర్కొన్నారు. ‘  యుద్ధంలో భారత్ భారీగా భూభాగాలను, సైనికులను కోల్పోతుండడంతో నెహ్రూ ఆందోళనతో కెన్నడీకి రెండు లేఖలు రాశారు. యుద్ధంలో సాయం  చేయాలని, 12 స్క్వాడ్రన్ల యుద్ధ విమానాలను, రవాణా విమానాలను పంపాలని కోరారు.  

దాదాపు 350 యుద్ధ విమానాలు, 10 వేల మంది సైనికులు, సిబ్బందిని పంపాలన్నారు. బాంబర్లను పాక్‌పై వేయబోమని హామీ ఇచ్చారు. ఈ లేఖను అమెరికాలోని అప్పటి భారత రాయబారి నేరుగా కెన్నడీకి అందజేశారు. బ్రిటన్ ప్రధానికి  కూడా ఇదే తరహాలో నెహ్రూ లేఖ రాశారు. నెహ్రూ లేఖపై కెన్నడీ సానుకూలంగానే స్పందించి.. యుద్ధానికి సన్నద్ధమయ్యారు. కానీ అమెరికా తగిన చర్యలు చేపట్టేలోపే చైనా ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించి, యుద్ధాన్ని నిలిపేసింది’ అని బ్రూస్ పుస్తకంలో పేర్కొన్నారు.

భారత ఈశాన్య ప్రాంతంలోని చాలా భూభాగంలోకి, కోల్‌కతా వరకూ చొచ్చుకువచ్చిన చైనా... అమెరికా, బ్రిటన్‌లు యుద్ధంలోకి దిగుతున్నాయన్న భయంతోనే ఒక్కసారిగా వెనక్కితగ్గిందన్నారు. ఈ పుస్తకం నవంబర్‌లో మార్కెట్లోకి విడుదల కానుంది.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు