నిత్య గాయాల బలూచ్‌!

18 Aug, 2016 01:41 IST|Sakshi
నిత్య గాయాల బలూచ్‌!

పాక్‌ పాలనలో నలుగుతున్న విలీన ప్రాంతం
స్వేచ్ఛ కోసం ఏడు దశాబ్దాలుగా పోరాటం
న్యూఢిల్లీ: బలూచిస్తాన్‌..! భారత్, పాకిస్తాన్‌ల తాజా మాటల యుద్ధంలో నలుగుతున్న పేరు. కశ్మీర్‌పై పాక్‌ దుష్టపన్నాగాలను దునుమాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పంద్రాగస్టు ప్రసంగంలో బలూచ్, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లలో హక్కుల ఉల్లంఘనను ప్రస్తావించడంతో బలూచ్‌ అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బలూచ్‌ వివాదం పూర్వాపరాల గురించి..
తెలిసింది తక్కువ..
భారత్‌కు కశ్మీర్‌లా బలూచ్‌ పాక్‌కు సమస్యాత్మక ప్రాంతం. అయితే ఇది కశ్మీర్‌లా అంతర్జాతీయ దష్టిని ఆకర్షించలేదు. పాక్‌ సమయం దొరికినప్పుడల్లా కశ్మీర్‌లో హక్కుల ఉల్లంఘన గురించి అంతర్జాతీయ వేదికలపై మాట్లాడుతుండడం తెలిసిందే. చీకటి బిలంగా(బ్లాక్‌ హోల్‌), జర్నలిస్టులకు నిషిద్ధ ప్రాంతంగా పేరొందిన బలూచ్‌లోని ప్రజలు స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం సాగిస్తున్న పోరాటం గురించి, వారిపై పాక్‌ బలగాల, పంజాబీ వర్గీయుల దమనకాండ గురించి ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ.
వనరుల నెలవు..
బంగారం, రాగి వంటి ఖనిజాలు, చమురు వనరులకు నెలవైన బలూచ్‌ వాస్తవానికి భారత ఉపఖండంలో భాగం కానే కాదు. భారత్, పాక్‌లకంటే అఫ్గానిస్తాన్, ఇరాన్‌లతోనే ఆ ప్రాంతానికి సారూప్యాలు ఎక్కువ. విస్తీర్ణంలో పాక్‌లో 40 శాతంగా ఉన్నా ఆ దేశ జనాభాలో 4 శాతమే(1.3 కోట్ల మంది) అక్కడ ఉంది. పాక్‌లో అతి పెద్ద రాష్ట్రం కూడా బలూచిస్తానే. పాక్‌ ఆదాయంలో అధిక భాగం అక్కడి వనరుల నుంచే వస్తోంది.
పాక్‌లో విలీనం ఇలా..
1947లో భారత విభజనతో ఏర్పడిన పాక్‌.. బలూచ్‌ను తనలో కలుపుకోవడానికి నానా యత్నాలూ చేసింది. బలూచ్‌లోని లాస్‌బెలా, ఖరాన్, మక్రాన్‌ సంస్థానాలు పాక్‌లో విలీనం కాగా, కలాత్‌ మాత్రం విడిగా ఉండిపోయింది. పాక్‌లో కలవాలని చివరి బలూచ్‌ స్వతంత్ర పాలకుడైన కలాత్‌ రాజు మీర్‌ అహ్మద్‌ యార్‌ ఖాన్‌తో పాక్‌ తొలి గవర్నర్‌ జనరల్‌ మహమ్మద్‌ అలీ జిన్నా బలవంతంగా ఒప్పందం చేయించుకున్నాడని అంటారు. రక్షణ, విదేశాంగ వ్యవహారాలు వంటి వాటిపై పాక్‌కు, బలూచ్‌కు మధ్య తాత్కాలిక ఒప్పందమొకటి ఆనాడు కుదిరింది. అయితే 1948, మార్చి 26న యార్‌ ఖాన్‌ బలూచ్‌ను పాక్‌లో విలీనం చేసేందుకు ఒప్పుకున్నట్లు పాక్‌ సర్కారు ప్రకటించింది. తర్వాత సైనిక ఆపరేషన్‌తో బలూచ్‌ను విలీనం చేసుకుంది.

అప్పట్నుంచి స్థానికులపై దారుణమైన అణచివేత కొనసాగుతూనే ఉంది. హింస, రక్తపాతం, హక్కుల నిరాకరణ నిత్యకత్యాలైపోయాయి. స్వాతంత్య్రం కోసం ఎలుగెత్తిన గొంతుకలను బలగాలు నొక్కేస్తున్నాయి. అక్కడి విలువైన ఖనిజ వనరులను పాక్‌ సంపన్న వర్గాలు, ప్రభుత్వం దోచుకుంటున్నాయి. దీనికి నిరసనగా బలూచీలు 1948 నుంచి ఐదుసార్లు(1948, 1958,  1962–63, 1977–78, 2003) చిన్నపాటి సాయుధ తిరుగుబాట్లు చేశారు. అయితే పాక్‌ ప్రభుత్వం ఉక్కుపాదంతో వాటిని అణచేసింది. గత పదేళ్లలో 2 లక్షల మంది బలూచీలు హత్యకు గురయ్యారని, 25 వేల మంది ఆచూకీ లేకుండా పోయారని బలూచ్‌ ఉద్యమ నేత నయేలా ఖాద్రీ చెప్పారు.

మరిన్ని వార్తలు