ఆదిమానవుల్లోనే ఇదో కొత్త తెగ

9 Aug, 2015 02:31 IST|Sakshi
ఆదిమానవుల్లోనే ఇదో కొత్త తెగ

పుల్లూర్‌కు చరిత్రలో స్థానం: ఏపీ పురావస్తు శాఖ డెరైక్టర్ రామకృష్ణారావు
సిద్దిపేట రూరల్: మెదక్ జిల్లా సిద్దిపేట మండలం పుల్లూర్‌లో పురావస్తుశాఖ చేపట్టిన బృహత్ శిలాయుగపు సమాధుల తవ్వకాలు కొనసాగుతున్నాయి. శనివారం ఏపీ పురావస్తు శాఖ డెరైక్టర్ డాక్టర్ జీవీ రామకృష్ణారావు ఈ సమాధులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2013లో తానే పుల్లూర్‌లో పరిశోధన చేసి, కేంద్రం అనుమతి కోసం నివేదిక పంపించినట్లు చెప్పారు. ప్రస్తుతం తవ్వకాలను చూస్తుంటే ఆదిమానవుల్లోనే కొత్త తెగకు చెందిన వారు ఈ ప్రాంతంలో 300 ఏళ్లు ఇక్కడ ఉన్నట్టు భావించవచ్చన్నారు.

ఈ తవ్వకాలతో పుల్లూర్ గ్రామానికి చరిత్రలో స్థానం లభించే అవకాశం ఉందన్నారు. సాధారణంగా సమాధులు ఎనిమిది రకాలుగా ఉంటాయన్నారు. ఇక్కడ డార్మినాయిడ్, వర్తలాకర్, సిస్ట్ సమాధులున్నట్లు పేర్కొన్నారు. ఈ తవ్వకాల్లో లభించిన మట్టి పాత్రలు, పరికరాలు, వేటాడే వస్తువుల ఆధారంగా వీటిని 3వేల సంవత్సరాల క్రితం వినియోగించినట్లు చెప్పవచ్చని తెలిపారు. ఇదిలా ఉండగా.. పుల్లూర్‌లో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి.

ఇప్పటి వరకు రెండు రకాల సమాధులను తవ్వారు. మూడో రకం సమాధి తవ్వకాలను ప్రారంభించారు. పురావస్తుశాఖ సాంకేతిక సహాయకులు ప్రేమ్‌సాగర్, రిటైర్డ్ ముఖ్య సంరక్షకుడు ఎర్రమరాజు భానుమూర్తి పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలు