నోట్ల రద్దుపై సీఎం యూ టర్న్

11 Feb, 2017 08:39 IST|Sakshi
నోట్ల రద్దుపై సీఎం యూ టర్న్
నిన్న మొన్నటివరకు నల్లధనాన్ని అరికట్టడానికి పెద్దనోట్ల రద్దు ఉపయోగపడుతుందని చెప్పిన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. ఉన్నట్టుండి యూ-టర్న్ తీసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడా క్యాష్‌లెస్ లేదా లెస్ క్యాష్ ఆర్థిక వ్యవస్థలు విజయవంతమైన దాఖలాలు లేవని, భారతదేశంలో అది ముందే జరగదని అన్నారు. అంతకుముందు తమ సొంత పార్టీకి చెందిన ఎంపీలు పార్లమెంటులో పెద్దనోట్ల రద్దును తీవ్రంగా విమర్శించినా.. నితీష్ మాత్రం దాన్ని చాలా ధైర్యవంతమైన ముందడుగుగా అభివర్ణించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన మాట మారింది. పెద్దనోట్ల రద్దు చారిత్రక తప్పిదమన్న మన్మోహన్ సింగ్ మాటలే నిజమని, ఆ నిర్ణయం వల్ల ఎవరికి ప్రయోజనం కలిగిందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెబుతున్నారని, కానీ ఐదేళ్ల తర్వాత వాళ్లే ఇక్కడ ఉండనప్పుడు ఎలా ఆదాయం పెంచుతారని ప్రవ్నించారు. సమస్యలను పక్కదోవ పట్టించడం అధికారంలో ఉన్నవాళ్లకు బాగా అలవాటైపోయిందని విమర్శించారు. 
 
పెద్దనోట్ల రద్దును తాను పూర్తిగా వ్యతిరేకించడం లేదని, సూత్రప్రాయంగా దానికి తన మద్దతు ఉంటుందని, అయితే.. దాని అమలులో చేసిన లోపాల వల్ల సామాన్యుడు చాలా కష్టాలు పడుతున్నాడని నితీష్ కుమార్ చెప్పారు. తొలిరోజుల్లో మాత్రం.. కొన్నాళ్ల పాటే కష్టాలు ఉండొచ్చు గానీ దీర్ఘకాలంలో దానివల్ల సానుకూల ఫలితాలు వస్తాయని ఇదే నితీష్ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ బిల్లుకు కూడా ఆయన తన సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.
మరిన్ని వార్తలు