రూ.2 వేల నోటుపై వివరణ ఇచ్చిన జైట్లీ

17 Mar, 2017 15:47 IST|Sakshi
రూ.2 వేల నోటుపై వివరణ ఇచ్చిన జైట్లీ

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం చలామణిలోకి తీసుకొచ్చిన కొత్త రూ.2వేల నోటుపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీవివరణ ఇచ్చారు.   రూ.2 వేల నోటును రద్దు చేసే ఆలోచన లేదని  శుక్రవారం లోక్‌సభలో  ప్రశ్నోత్తరాల సమయంలో స్పష్టం చేశారు.

డీమానిటైజేషన్‌ తరువాత తీసుకొచ్చిన రూ .2 వేల నోటును  ఉపసంహరించుకోవాలనే  ప్రతిపాదన లేదని  లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో  జైట్లీ తెలిపారు. అలాగే రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత  రూ 12.44 లక్షల కోట్ల (డిసెంబర్ 10, 2016 నాటికి) మొత్తం పాతనోట్లు  బ్యాంకులకు చేరినట్టు లోక్‌సభలో  చెప్పారు.  మార్చి 3, 2017 నాటికి మొత్తం చలామణీలో వున్న కరెన్సీ విలువ రూ.12 లక్షలకోట్లుగా ఉండగా, జనవరి 27 నాటికి రూ.9.921 లక్షల కోట్లుగా ఉందని  వివరించారు.  అయితే ఈ వివరాలను ఇంకా పరిశీలించాల్సి ఉందని, అకౌంటింగ్‌ లో  తప్పులు, డబుల్‌ కౌంటింగ్‌ తదితర కారణాల రీత్యా  పూర్తివివరాలు ఇంకా అందాల్సి ఉందన్నారు.

అనినీతిని, నల్లధనం, నకీలి కరెన్సీ,  టెర్రరిజాన్ని నిరోధించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం  పెద్దనోట్ల రద్దును చేపట్టిందని  ఆర్థిక మంత్రి సభలో ప్రకటించారు.  డీమానిటైజేషన్ కాలంలో   నగదు విత్‌ డ్రా లపై కొన్ని నిబంధనలు విధించినా,  ఆ తర్వాత క్రమంగా  వాటిని తొలగించామని జైట్లీ చెప్పారు.
 

మరిన్ని వార్తలు