‘సీఎం ఎవరో మీకు రేపు తెలుస్తుంది’

17 Mar, 2017 15:32 IST|Sakshi
‘సీఎం ఎవరో మీకు రేపు తెలుస్తుంది’

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎవరనే విషయం రేపు(శనివారం) తెలుస్తుందని యూపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య స్పష్టం చేశారు. సీఎం ఖరారు విషయంపై శాసనసభా పక్షం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ‘యూపీ సీఎం ఎవరనే విషయంపై లెజిస్టేచర్‌ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ప్రమాణ స్వీకార కార్య​క్రమం మార్చి 19న ఉంటుంది. దీనికి బీజేపీ అగ్ర నేతలతోపాటు కేంద్రమంత్రులు, ప్రముఖ వ్యక్తులు హాజరుకానున్నారు’ అని మౌర్య శుక్రవారం పార్లమెంటు వెలుపల చెప్పారు.

కొంత అస్వస్థతగా ఉందంటూ ఆస్పత్రిలో చేరిన ఆయన తదనంతరం డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. ‘నాకు ఏవో చిన్న సమస్యలు అనిపించాయి. అందుకే ఆస్పత్రిలో చేరాను. అయితే, నిన్ననే నేను బయటకొచ్చాను. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను’ అని మౌర్య చెప్పాడు. అదే సమయంలో సీఎం ఎవరనే విషయంపై పదేపదే ప్రశ్నించగా ‘రేపు సాయంత్రం 4.30గంటలకు లెజిస్టేచర్‌ పార్టీ సమావేశం కానుంది.

ప్రభుత్వ పెద్దగా ఎవరు వస్తారనేది మీకు రేపు కచ్చితంగా తెలుస్తుంది’ అని అన్నారు. అయితే, సీఎం కాబోయే వ్యక్తిని ఎంపికచేయాలంటూ అమిత్‌షా బాధ్యతలు అప్పగించారంట కదా అని ప్రశ్నించగా.. ఒక పార్టీ అధ్యక్షుడిగా తాను ఏం చేయాలో అది పూర్తి చేస్తానని అన్నారు. సీఎం రేసులో మౌర్య కూడా ఉన్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు