వర్షాభావంతో జలాశయాలు వెలవెల

27 Jul, 2015 01:55 IST|Sakshi
వర్షాభావంతో జలాశయాలు వెలవెల

జల విద్యుత్ ఆశలు ఆవిరి

హైదరాబాద్: జల విద్యుత్‌పై ఆశలు ఆవిరయ్యాయి. తీవ్ర వర్షాభావంతో శ్రీశైలం, నాగార్జున సాగర్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర జలాశయాల్లో చుక్క నీరూ రాలేదు. దీంతో జల విద్యుదుత్పత్తి ద్వారా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌ను గట్టెక్కిద్దామనుకున్న ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయి. వాస్తవానికి జూలైలోనే జల విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని తెలంగాణ విద్యుత్ శాఖ అంచనా వేసింది. ఆగస్టు నాటికి 1,000 మెగావాట్ల జల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ఆశలు పెట్టుకుంది. జూలై నుంచి వచ్చే మార్చి వరకు 4,144 మెగావాట్ల జల విద్యుదుత్పత్తి జరుగుతుందని అంచనా వేసింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు సంవృద్ధిగా కురిసి రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు నిండితేనే విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుంది. సమీప భవిష్యత్తులో ఈ పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో లోటును పూడ్చుకోవడానికి బయటి రాష్ట్రాల నుంచి కరెంటును కొనుక్కోక తప్పని పరిస్థితి.

అంచనాలు తలకిందులు
2015 జూలై నుంచి 2016 మార్చి వరకు రాష్ట్రంలో వినియోగం, లభ్యతపై విద్యుత్ శాఖ అంచనాలు సైతం సిద్ధం చేసుకుంది. ఆశించిన మేరకు జల విద్యుదుత్పత్తి జరిగితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లో కరెంటు డిమాండు పతాకస్థాయికి చేరినా మిగులు విద్యుత్ ఉండనుంది. దీని ఆధారంగానే ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరాపై ధీమా వ్యక్తంచేస్తూ వచ్చింది. అయితే, జల విద్యుదుత్పత్తి లేకపోతే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్‌లలో మాత్రం విద్యుత్ లోటు తప్పదని ప్రభుత్వ అంచనాలే పేర్కొంటున్నాయి.

తాత్కాలిక ఒప్పందాల ద్వారా 2,000 మెగావాట్లకు పైగా విద్యుత్ కొనుగోలు జరుగుతోంది. కొనుగోళ్లు, జెన్‌కో సొంత ఉత్పాదన ద్వారా గరిష్టంగా 6,000 మెగావాట్ల డిమాండును నెరవేర్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసుకుంది. అయితే, పెరుగుతున్న ఖరీఫ్ సాగు, ఉష్ణోగ్రతలతో విద్యుత్ డిమాండు గరిష్టంగా 8,000 మెగావాట్లకు తాకే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో మరో 2,000 మెగావాట్లు కొనుగోళ్లు చేయక తప్పని పరిస్థితి. ఎంత ధరకైనా అవసరమైన కరెంటును కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తాత్కాలిక కొనుగోళ్లకు ప్రైవేటు సంస్థలతో కొత్త ఒప్పందాల కోసం విద్యుత్ శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.

మరిన్ని వార్తలు