ముంబైలో లీటరు పెట్రోల్‌ రూ. 29లే!

25 Apr, 2017 16:23 IST|Sakshi
ముంబైలో లీటరు పెట్రోల్‌ రూ. 29లే!
  • చమురు సంస్థలు అమ్మేది ఈ ధరకే..
  • మిగతాదంతా ప్రభుత్వ బాదుడే
  • దేశంలో పెట్రోల్‌కు అత్యధిక ధర చెల్లించేది ముంబైకర్లే
  • మన హైదరాబాద్‌లోనూ దాదాపు అంతే!
  • ముంబై: దేశంలో పెట్రోల్‌ ధరలు పెరగడం కొత్త కాదు. కానీ, ముంబై వాసులకు సోమవారం ఊహించనిరీతిలో షాక్‌ తగిలింది. చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా పెట్రోల్‌ ధర పెంచకున్నా.. రాష్ట్ర ప్రభుత్వమే కరువు సెస్సు పేరిట రూ. 3 అదనంగా వడ్డించింది. ఈ దెబ్బకు దేశంలోనే పెట్రోల్‌కు అత్యధిక ధర చెల్లిస్తున్న నగరవాసులుగా ముంబైకర్లు నిలిచారు. ఢిల్లీలో ప్రస్తుతం లీటరు పెట్రోల్‌ రూ. 68.26 లభిస్తుండగా.. అంతకన్నా పది రూపాయలు ఎక్కువగా  ముంబైవాసులు చెల్లించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధానిలో లీటరు పెట్రోల్‌ ధర రూ. 77.50లకు లభిస్తోంది. ఈ పెట్రోల్‌ వాతపై ముంబై వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

    నిజానికి ముడిచమురు ధరలు, డాలర్‌-రూపాయి ఎక్స్చేంజ్‌ రేట్లు చూసుకుంటే మార్కెటింగ్‌ చార్జీలు కలుపుకొని చమురు సంస్థలు రూ. 29లకే లీటరు పెట్రోల్‌ను డీలర్లకు అందజేస్తున్నాయి. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాదే పన్నులు, సెస్సులతో కలిపి ఈ ధర ఏకంగా 77.50 రూపాయలకు చేరింది. అంటే మార్కెట్‌ ధర కంటే రూ. 47.93 అధికమొత్తాన్ని వినియోగదారులు పన్నులు, సుంకాల రూపంలో చెల్లిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్‌ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వ వ్యాట్‌, సెస్సులు, పెట్రోల్‌ బంకు యజమానుల కమిషన్‌ ఉంటుంది. అసలు ధర కన్నా 153శాతం మొత్తాన్ని పన్నుల రూపంలో పెట్రోల్‌ వినియోగదారులపై భారం పడుతోంది.

    ముంబైలో పన్నులు ధరలు ఓసారి చూస్తే..
    రవాణా చార్జీలతో కలుపుకొని బ్యారెల్‌ ముడిచమురు ధర : 65.34 (డాలర్ల రూపంలో)
    సగటు డాలర్‌ మార్పిడి ధర                                        : రూ. 64.76
                                                                     లీటరుకు రూపాయలలో
    రిఫైనరీలకు చమురు సంస్థలు చెల్లించే ధర            26.86
    చమురు కంపెనీ ఆపరేటింగ్‌/మార్కెటింగ్‌ చార్జీలు     2.68
    కేంద్ర ఎక్సైజ్‌ డ్యూటీ                                         21.48
    ముంబై అక్ట్రోయ్‌                                              1.10
    రవాణా వ్యయం                                               0.20
    రూ. 9 సెస్సు కలుపుకొని రాష్ట్ర వ్యాట్‌ 26శాతం        22.60
    డీలర్‌ కమిషన్‌                                                  2.50
    మొత్తం                                                           77.50

    దాదాపు దేశవ్యాప్తంగా ఇదేరీతిలో  పెట్రోల్‌ వినియోగదారులపై పన్నులవాత మోత మోగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా ఆదాయాన్ని పెంచుకోవడానికి పెట్రో ఉత్పత్తులను ప్రధాన వనరుగా మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ రూ. 72. 66లకు లభిస్తోంది. దాదాపు ముంబైరీతిలోనే హైదరాబాద్‌లోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ వినియోగదారులపై పన్నుల మోత మోగుతోంది. మరోవైపు పెట్రోల్‌ ధర పెరిగిన ప్రతిసారి మధ్య, దిగువ తరగతి జీవులకు మరింతగా ఇబ్బందులు తప్పడం లేదు. నిజానికి వెనుకబడిన దేశాలైన మన పొరుగుదేశాల్లోనే పెట్రోల్‌ ధరలు చాలా తక్కువగా ఉండటం గమనార్హం. పాకిస్థాన్‌లో రూ. 43.68లకు, శ్రీలంకలో రూ. 50.95, నేపాల్‌లో రూ. 64.24, బంగ్లాదేశ్ లో రూ. 70.82 లకు లీటరు పెట్రోల్‌ లభిస్తోంది.
     

మరిన్ని వార్తలు