మహానగరాభివృద్ధిని ‘పాత’రేశారు!

12 Sep, 2015 02:29 IST|Sakshi
మహానగరాభివృద్ధిని ‘పాత’రేశారు!

పాత తేదీలతో లే అవుట్‌లు, భవనాలకు అనుమతులు
* బిల్డర్లతో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌ల కుమ్మక్కు
* రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని 5 గ్రామాల్లో అక్రమాలు
* హెచ్‌ఎండీఏ ప్రత్యేక విచారణలో వెల్లడి.. క్రిమినల్ కేసులకు సిఫారసు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని గ్రామాల్లో లే అవుట్‌లు, భవన నిర్మాణాలకు అనుమతులు జారీలో భారీ అవకతవకలు జరుగుతున్నాయి.

బిల్డర్లు, రియల్టర్లతో గ్రామ పంచాయతీల కార్యనిర్వహణాధికారులు(ఈఓలు), కార్యదర్శులు, సర్పం చ్‌లు కుమ్మక్కై ఏకంగా దశాబ్ద కాలం కింది నాటి పాత తేదీలతో దొడ్డిదారిలో అనుమతులు జారీ చేసేస్తున్నారు. అక్రమ మార్గంలో లభించిన అనుమతులతో బిల్డర్లు వందల సంఖ్యలో నివాస, వ్యాపార సముదాయాలతో పాటు గేటెడ్ కమ్యూనిటీలను ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఈఓలు, సర్పంచ్‌లకు లక్షల రూపాయల్లో మామూళ్లు అందుతున్నాయి. నేరుగా హెచ్‌ఎండీఏ కమిషనర్లు ఇవ్వాల్సిన అనుమతులను ఈవోలే ఇచ్చేస్తుండటంతో సంస్థకు రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడుతోంది. రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని నిజాంపేట, గండి మైసమ్మ, ప్రగతినగర్, బౌరంపేట, దూలపల్లి గ్రామాల పరిధిలో అక్రమ అనుమతుల ఆరోపణలపై హెచ్‌ఎండీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తాజాగా చేపట్టిన విచారణలో ఈ బాగోతం వెలుగు చూసింది.
 
అధికార పరిధి దాటిన ఈఓలు...
గ్రామ పంచాయతీ ఈఓల అధికారాలను కేవలం రెండంతస్తుల భవన నిర్మాణాల అనుమతుల వరకే పరిమితం చేస్తూ 2008 ఏప్రిల్ 17న హెచ్‌ఎండీఏ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇంకా పాత తేదీలతో దొడ్డిదారిలో ఈఓలు మూడంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఈ ఐదు గ్రామాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 36 భవన సముదాయాలతోపాటు ఆరు గేటెడ్ కమ్యూనిటీలను హెచ్‌ఎండీఏ బృందం పరిశీలించగా, అందులో 30 భవనాలకు స్థానిక గ్రామ పంచాయతీల ఈఓలు పాత తేదీలతో అనుమతులు జారీ చేసినట్లు బయటపడింది.

అధికారులను ఈఓలు దుర్వినియోగం చేయడంతోపాటు బిల్డర్లతో కుమ్మక్కై భారీగా లంచాలు స్వీకరించినట్లు ఈ విచారణలో తేలింది.  ఇక ఎల్‌ఆర్‌ఎస్ పథకం గడువు ముగిసి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఈ గ్రామాల్లో పాత తేదీలతో అక్రమ లే అవుట్‌లను క్రమబద్ధీకరిస్తున్నట్లు హెచ్‌ఎండీఏ గుర్తించింది. ఈఓలు, సర్పంచ్‌లతో కుమ్మక్కైన బిల్డర్లు బౌరంపేట, మల్లంపల్లి గ్రామాల్లో సుమారు 45 ఎకరాల్లో పెద్ద మొత్తంలో గేటెడ్ కమ్యూనిటీలను నిర్మిస్తున్నట్లు బయటపడింది.
 
ప్రభుత్వానికి హెచ్‌ఎండీఏ లేఖ
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ కోసం బీపీఎస్ పథకాన్ని మళ్లీ ప్రవేశపెట్టనుందని, అప్పుడు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకోవచ్చని ఈఓలు సలహా ఇవ్వడంతోనే బిల్డర్లు అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారని హెచ్‌ఎండీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఐదు గ్రామాల్లో అక్రమ మార్గంలో అనుమతులు జారీ చేసిన ఈఓలు, సర్పంచ్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలిని మిశ్రా ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్రమ లే అవుట్‌లు, కట్టడాల ఫొటోలు, ఇతర వివరాలతో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.

మరిన్ని వార్తలు