పిచ్చికుక్కలా పాక్‌; మమ్మల్ని కాల్చిచంపండి..

14 May, 2017 11:27 IST|Sakshi


(పాక్‌ వైపు నుంచి భీకర కాల్పులు.. ప్రాణాలు కాపాడుకునేందుకు గ్రామస్తుల యాతన)


రాజౌరీ: దాయాది పాకిస్థాన్‌ పిచ్చిపట్టిన కుక్కలా పేట్రేగిపోతున్నది. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్‌వోసీ) వెంబడి భారత గ్రామాలపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నది. పాక్‌ ఆర్మీ శుక్రవారం మొదలుపెట్టిన కాల్పుల పర్వం ఆదివారం ఉదయం దాకా ఎడతెరిపిలేకుండా సాగుతూనేఉంది. వేగంగా దూసుకొస్తున్న షెల్స్‌, తూటాలు.. గ్రామస్తులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. అప్రమత్తమైన భారత సన్యం పాక్‌ రేంజర్లకు గట్టి సమాధానం ఇస్తూనే, జాగ్రత్త చర్యల్లో భాగంగా సరిహద్దు గ్రామాలను ఖాళీ చేయించింది.

‘ఆదివారం తెల్లవారుజామున రాజౌరీ సెక్టార్‌లో ఎల్‌వోసీని ఆనుకొని చీటి బక్రి గ్రామంపైకి పాక్‌ ఆర్మీ కాల్పులు జరిపింది. వెంటనే అప్రమత్తమై వాళ్లకు(పాక్‌కు) ధీటుగా జవాబిచ్చాం. అక్కడి ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాం’ అని ఆర్మీ అధికారులు మీడియాకు చెప్పారు. ఇదే సెక్టార్‌లోని ఏడు గ్రామాలపై శనివారం పాక్‌ జరిపిన కాల్పుల్లో మైనర్‌ బాలిక సహా ఇద్దరు మరణించారు. 35 పౌరులు, కొందరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

వెనక్కి వెళ్లం.. కాల్చిచంపండి..
పాకిస్థాన్‌ బరితెగింపు దృష్ట్యా నియంత్రణ రేఖ వెంబడి గ్రామాలను ఆర్మీ అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. సుమారు 200 కుటుంబాలకు చెందిన 1000 మందిని రాజౌరీలో ఏర్పాటుచేసిన సహాయక శిబిరాలకు తరలించారు. సొంత ఊళ్లను వదిలేసి క్యాంపుల్లో బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్న గ్రామస్తులు తమను కలిసిన మీడియాతో గోడువెళ్లబోసుకున్నారు. ‘ఆ కాల్పుల వర్షాన్ని మేం తట్టుకోలేం. అలాగని సొంత ఊరిని వదిలేసిరాలేం. మాకు వేరే దారిలేదు. మమ్మల్ని ఇక్కడే కాల్చి చంపేయండి..’ అని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్రిక్తతల నేపథ్యంలో రాజౌరీ, నౌవ్‌షీరా, మాంజకోటే, డూంగి జోన్లలోని 87 పాఠశాలలను మూసివేశారు.

>
మరిన్ని వార్తలు