ఆన్‌లైన్లో మనీ ట్రాన్స్‌ఫర్.. ఇలా భద్రం

12 Apr, 2015 02:40 IST|Sakshi
ఆన్‌లైన్లో మనీ ట్రాన్స్‌ఫర్.. ఇలా భద్రం

బ్యాంకింగ్ లావాదేవీల్లో ప్రస్తుతం ఆన్‌లైన్ మాధ్యమం చాలా కీలక ంగా మారుతోంది. నగదు బదిలీ తదితర లావాదేవీలన్నీ సులభతరం, వేగవంతంగా జరగడమే కాకుండా చౌకగా ఉంటుండటం ఇందుకో కారణం. అయితే, సులభతరమైన మాధ్యమం అయినప్పటికీ ఆన్‌లైన్‌లోనూ కొన్ని చిక్కులుంటాయి. ఉదాహరణకు పొరపాటున ఖాతా నంబరు తప్పుగా ఎంటర్ చేయడం వల్ల ఒకరికి పంపాల్సిన డబ్బు మరొకరికి వెళ్లిపోవచ్చు. మరలాంటప్పుడు ఏం చేయాలి? అసలు అంతకన్నా ముందుగా ఇలాంటి సమస్యలు తలెత్తకుండా లబ్దిదారును రిజిస్టర్ చేసుకునే సమయం నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అనే దానిపై ఈ కథనం.
 
 సాధారణంగా ఆన్‌లైన్లో నగదు పంపదల్చుకున్నప్పుడు ఎవరికి పంపదల్చుకున్నామో వారి అకౌంటు నంబరును మన బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం లబ్దిదారు పేరు, అకౌంటు నంబరు, బ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. ఈ క్రమంలో ఎలాంటి తప్పులు దొర్లకుండా సదరు లబ్దిదారు అకౌంటు నంబరును రెండు సార్లు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అంకెల్లో తప్పులు రాకుండా జాగ్రత్తపడొచ్చు. అంతే కాదు చాలా సందర్భాల్లో లబ్దిదారు పేరును నమోదు చేసిన అరగంట దాకా లావాదేవీలు జరపడానికి వీలుండదు. ఈ వ్యవధిలో రిజిస్టర్ చేయగోరుతున్న లబ్దిదారుల వివరాలను మరోసారి ధృవీకరించుకునేందుకు ఖాతాదారుల మొబైల్ నంబర్లకు బ్యాంకులు సంక్షిప్త సందేశాలు పంపుతుంటాయి.
 
 బాధ్యత మనదే..
 అప్పటికీ ఒకోసారి తప్పిదాలు జరిగే అవకాశం ఉండొచ్చు. మనం అకౌంటు నంబరు రిజిస్టరు చేసుకునే సమయంలోనే ఏదో ఒక అంకె తప్పుగా పడి ఉంటే? దాన్ని గుర్తించకపోయినంత మాత్రాన.. ఆ తర్వాతెప్పుడైనా మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తే ఆ లావాదేవీ ఆగిపోదు. డబ్బు మరెవరికో వెళ్లిపోతుంది.  అంతే కాదు పంపించే నగదు  మొత్తంలో ఏమరుపాటుగా ఒక సున్నా అదనంగా చేర్చినా సమస్యే. ఇలాంటి తప్పిదాలకు పూర్తి బాధ్యత నగదు పంపే ఖాతాదారుదే అవుతుందని గుర్తుంచుకోవాలి. ఇలాంటివి జరిగినప్పుడు బ్యాంకుకు వెంటనే సమాచారం ఇవ్వాలి. మనం ఎంత త్వరగా సమాచారం ఇస్తే అంత త్వరగా లావాదేవీని నిలుపుదల చేసే వీలుంటుంది.
 
 ఒకవేళ ఖాతాదారుది, లబ్దిదారుది ఒకే బ్యాంక్ అయిన పక్షంలో నగదు దాదాపు చాలా వేగంగా బదిలీ అయిపోతుంది. కనుక గంటలోపే సమాచారం అందజేస్తే బ్యాంకులు వీలైనంత త్వరగా నగదును రివర్స్ చేసే వీలుంటుంది. అయితే, ఒకవేళ నగదు అప్పటికే బదిలీ అయిపోయిన పక్షంలో లబ్దిదారుకు కూడా సమాచారం అందజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వారి పర్మిషన్ లేకుండా బ్యాంకు ఆ మొత్తాన్ని వెనక్కి తేలేదు. ఒకవేళ లబ్దిదారు గానీ సహకరించకపోతే, చట్టబద్ధంగా వెళ్లాల్సి ఉంటుంది. ఏదైతేనేం... ఇలాంటివి జరగకుండా ఉండాలంటే లబ్దిదారు ఖాతా నంబరు రిజిస్టర్ చేసుకున్నాక ముందుగా చిన్న మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేసి పరిశీలించుకోవడం శ్రేయస్కరం.
 

మరిన్ని వార్తలు