రాందేవ్ మెడిసిన్పై సభలో దుమారం

30 Apr, 2015 14:39 IST|Sakshi
రాందేవ్ మెడిసిన్పై సభలో దుమారం

న్యూఢిల్లీ: ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన దివ్యా ఫార్మసీ ఆయుర్వేద మెడిసిన్పై రాజ్యసభలో పెద్ద దుమారం రేగింది. ఈ మెడిసిన్ ఉపయోగించేవారికి మగ సంతానం కలుగుతుందని తయారీ దారులు ప్రకటించడాన్ని రాజ్యసభలోని ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అది ముమ్మాటికీ చట్టవిరుద్ధం, రాజ్యాంగేతరమైన చర్యగా పేర్కొంటూ దానిని వెంటనే నిషేధించి తయారీ దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. రాందేవ్ బాబాకు చెందిన దివ్యా ఫార్మసీ 'పుత్రజీవక్ బీజ్' అనే ఆయుర్వేద మెడిసిన్ను అందిస్తోంది. దీనిని వాడిన వారికి మగ సంతానం కలుగుతోందని ప్రచారం చేస్తోంది.

అయితే, దీనిపై జేడీయ ఎంపీ కేసీ త్యాగి సభలో ఈ ప్యాకెట్ ను ప్రదర్శిస్తూ దీనిని తాను దివ్యా మెడిసిన్ షాపులో తెచ్చానని, మగ పిల్లలు పుడతారని వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 14న తాను దీనిని తీసుకొన్నట్లు రశీదును కూడా సభలో ప్రదర్శించారు. రాందేవ్ పేరును ప్రస్తావించకుండా నిజంగా దేశాన్ని ఒక డైనమిక్ నాయకుడు పాలిస్తుంటే నరేంద్రమోదీ ఇప్పుడావిషయాన్ని రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పుడే సమాజ్ వాది పార్టీ ఎంపీ జయబచ్చన్ ఆ ప్యాకెట్ ను తీసుకెళ్లి ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు అందజేశారు. దాని ఉత్పత్తిని వెంటనే నిలిపివేసి లైసెన్సు రద్దు చేయాలని కోరారు. దీనిపై కొంత చర్చ జరిగినా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అధికార పక్షం స్పీకర్తో ప్రకటన చేయించింది.

మరిన్ని వార్తలు