బిన్ లాడెన్ను అమెరికాకు 'అమ్మేశారా'?

12 May, 2015 16:47 IST|Sakshi
బిన్ లాడెన్ను అమెరికాకు 'అమ్మేశారా'?

అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని సైతం గజగజ వణికించిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఎలా చనిపోయాడు? అమెరికన్ నిఘా వర్గాలు అతడి ఆచూకీని అత్యంత రహస్యంగా కనుగొని.. నేవీ సీల్స్ బృందాలను హఠాత్తుగా పంపి.. అత్యంత సాహసోపేతమైన ఆపరేషన్లో చంపేశారని ఇన్నాళ్లూ అనుకుంటున్నాం కదు. కానీ కాదట.. కొంతమంది పాకిస్థాన్ ఆర్మీ జనరల్స్, ఐఎస్ఐ ఉన్నతాధికారులు కలిసి ఒసామా బిన్ లాడెన్ను దాదాపు ఐదేళ్ల పాటు అబోతాబాద్లో దాచిపెట్టిన తర్వాత.. దాదాపు 160 కోట్ల రూపాయలకు లాడెన్ను అమెరికాకు అమ్మేశారట!! ఈ సంచలనాత్మకమైన విషయాన్ని హెర్ష్ అనే అమెరికన్ పాత్రికేయుడు బయటపెట్టాడు. గతంలో వియత్నాం యుద్ధ సమయంలో అమెరికా చేసిన అతి చేష్టలను బయటపెట్టిన చరిత్ర ఈ పాత్రికేయుడికి ఉంది.

2010 సంవత్సరంలో పాక్ నిఘా విభాఘానికి చెందిన ఓ సీనియర్ అధికారి తమ దేశంలోని అమెరికా రాయబార కార్యాలయానికి స్వయంగా వెళ్లి.. అక్కడ సీఐఏ స్టేషన్ చీఫ్ జొనాథన్ బ్యాంక్ను కలిశారని, తనకు భారీ మొత్తం ఇస్తే.. లాడెన్ ఆచూకీ చెబుతానని ఆఫర్ పెట్టారని హెర్ష్ తన కథనంలో రాశారు. అయితే ఆ మాటలను వెంటనే నమ్మని సీఐఏ వర్గాలు ఆ ఉన్నతాధికారికి పాలిగ్రఫీ టెస్టులు చేయించగా.. అతడు చెప్పిన విషయం నిజమేనని తేలింది. దాంతో అబోతాబాద్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, లాడెన్ ఉన్న భవనం మొత్తాన్ని శాటిలైట్ నిఘాలో ఉంచారు. 2010 అక్టోబర్ నాటికి లాడెన్ను ఎలా హతమార్చాలన్న ప్రణాళికలపై చర్చించే దశకు చేరుకున్నారు.

తర్వాత 2011 సంవత్సరంలో ఆనాటి పాక్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ అష్ఫఖ్ కయానీ, ఐఎస్ఐ అధినేత అహ్మద్ షుజా పాషా ఇద్దరూ అమెరికా నేవీ సీల్స్ బృందానికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి లాడెన్ను హతమార్చేందుకు తోడ్పడ్డారని కూడా హెర్ష్ తన కథనంలో పేర్కొన్నారు. రెండోసారి అధికారంలోకి రావాలనుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాయే ఇందుకు ముందునుంచి ప్రణాళికలు వేశారని ఆరోపించారు. ఈ మొత్తం విషయాలను అమెరికా ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి ఉప్పందించారట.

అయితే... యథాప్రకారం అమెరికా ఈ కథనాన్ని తీవ్రంగా ఖండించింది. హెర్ష్ రాసినవన్నీ నిరాధార విషయాలని తెలిపింది. మరోవైపు పాకిస్థాన్ కూడా ఈ కథనాలను తప్పని చెప్పింది. తమ అధికారులెవ్వరూ డబ్బులు తీసుకుని లాడెన్ ఆచూకీని అమెరికాకు అందించలేదని స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు