చెట్టుకింద... కట్టు ‘బడి’

7 Nov, 2015 07:46 IST|Sakshi
చెట్టుకింద... కట్టు ‘బడి’

చినరాజాం కాలనీ వాసుల వినూత్న నిరసన
‘మాగ్రామంలో పాఠశాలను మూసేయొద్దు’ అని ఎంతగా మొరపెట్టుకున్నా ప్రభుత్వం ఆలకించకపోవడంతో ఆగ్రామస్తులు వినూత్న నిరసనకు దిగారు. చెట్టుకిందే బడి నిర్వహిస్తూ సమస్యను అందరి దృష్టికీ తీసుకువెళుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో గల చినరాజాంకాలనీ ప్రభుత్వ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను తక్కువ మంది పిల్లలు ఉన్నారనే నెపంతో ప్రభుత్వం ఇటీవల మూసివేసింది.  పాఠశాలను మూసివేయడం సరికాదని గ్రామస్తులు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఆ గ్రామానికి దూరంగా ఉన్న వజ్రపుకొత్తూరు మండలం బరంపురం కాలనీ పాఠశాలలో దీనిని విలీనం చేసింది.

తమ గ్రామం నుంచి పిల్లలు రోడ్డుపై అంతదూరం నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తే ప్రమాదాలు జరుగుతాయని, మా పాఠశాల మాకు కావాలి అని గ్రామస్తులు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అయినా ఫలితం లేకపోవడంతో గ్రామంలో ఉన్న విద్యాధికులు ఒక చెట్టుకిందనే  బడి నిర్వహించి నిరసన తెలియజేస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈపరిస్థితి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు.
- పలాస

>
మరిన్ని వార్తలు