స్కాములేవీ చేయలేదు.. విచారణకు రెడీ

1 Jul, 2015 18:17 IST|Sakshi
స్కాములేవీ చేయలేదు.. విచారణకు రెడీ

స్కూలు పిల్లల కోసం రూ. 206 కోట్ల విలువైన సామగ్రి సరఫరా కాంట్రాక్టులలో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే ఎట్టకేలకు నోరు విప్పారు. ఇది కేవలం మాటలకు మాత్రమే పరిమితమైన స్కాం అని, కేవలం రాజకీయ కక్షతోనే తనపై పస లేని ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. దివంగత కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే కూతురైన పంకజ... మహారాష్ట్ర ప్రభుత్వంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం రూ. 408 కోట్లతో ఈ తరహా సామగ్రి కొనుగోలు చేసిందని ఆమె అన్నారు.

పిల్లలకు వేరుశనగ అచ్చులు, చాపలు, నోట్ పుస్తకాలు, వాటర్ ఫిల్టర్ల కొనుగోలు కాంట్రాక్టులను తమ పార్టీ కార్యకర్తలు, వాళ్ల కుటుంబ సభ్యులకే ఇచ్చారని ఆమెపై ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వమే ఎక్కువ ధర పెట్టి కొందని, తాము ఇంకా తక్కువకు కొన్నా అది తప్పేనంటే ఎలాగని ప్రశ్నించారు. ఒక్క రూపాయి మేర కూడా అక్రమాలు జరగలేదని, తన శాఖతో పాటు తాను కూడా ఈ అంశంలో ఏసీబీ విచారణకు సిద్ధంగా ఉన్నామని పంకజా ముండే చెప్పారు. కాగా, మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే కూడా ఓ నకిలీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశారని, ప్రభుత్వ పాఠశాలలకు అగ్నిమాపక పరికరాల కొనుగోలు కోసం రూ.191 కోట్ల కాంట్రాక్టు ఇవ్వడంలో అక్రమాలు చేశారని ఆరోపణలు వచ్చాయి.

మరిన్ని వార్తలు