బిచ్చగాడిగా ప్రత్యక్షమైన బాబా!

28 Aug, 2016 20:55 IST|Sakshi
బిచ్చగాడిగా ప్రత్యక్షమైన బాబా!

సాక్షి, చెన్నై: తమిళనాడులోని నామక్కల్ జిల్లా కుమార పాళయం ఎంజీయార్ నగర్‌ కు చెందిన మురుగేషన్ శిరిడీ సాయిబాబా వీరభక్తుడు. మెకానిక్ షాప్ నడుపుకొనే మురుగేషన్ కు కొద్దికాలంగా బాబా కలలోకి వచ్చి 'నేను మళ్లీ రాబోతున్నా'అని చెప్పేవాడు. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం.. మాసిన గడ్డం, చిరిగిన దుస్తులు, భుజానికి జోలెతో ఓ పెద్దాయన హఠాత్తుగా మురుగేషన్ దుకాణం ముందు ప్రత్యక్షం అయ్యాడు. అతణ్ని చూసి 'బాబా ప్రత్యక్షమయ్యారు.. బాబా వచ్చేశారు' అని కేకలు పెడుతూ చుట్టుపక్కల జనాలను పిలిచాడు. మురుగేషన్ బాబా భక్తుడనే విషయం తెలుసుకాబట్టి ప్రజలు కూడా ఆయన చెప్పినట్లు ఆ పెద్దాయననే బాబా అని నమ్మారు.

ఆయనను పక్కనే ఉన్న ఆలయంలోకి తీసుకెళ్లి భక్తిశ్రద్ధలతో పూజించారు. కాళ్లుకడిగి, ఆ నీళ్లను తలపై చల్లుకున్నారు. ఈ విషయంలో మీడియా సైతం ఉత్సాహాన్ని ప్రదర్శించింది. తన కలలోకి వస్తున్న బాబా ఆయనే అంటూ మురుగేషన్ మీడియాతో చెప్పాడు. అంతే, సమీపంలోని ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా బాబాను దర్శించుకునేందుకు వచ్చారు. కానుకల రూపంలో బాబాకు దాదాపు రూ.40 వేలు ముట్టజెప్పారు. కాగా, పక్క ఊళ్ల నుంచి వచ్చినవారిలో కొందరు సదరు బాబాను ఎక్కడో చూసినట్లు తమలోతాము చర్చించుకుని చివరికి ఒక అభిప్రాయానికి వచ్చారు.

అసలా పెద్దాయన బాబా కానేకాదు.. బిచ్చగాడు! కుమార పాళయం బస్టాండ్ పరిసరాల్లో కొన్నేళ్లుగా భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాడని నిర్ధారించుకున్న తర్వాత ప్రజల భక్తి కాస్తా ఆగ్రహంగా మారింది. ముసలాయనను చెడామడా తిట్టి, మెడపట్టి ఆలయం నుంచి బయటికి గెంటేశారు. కానుకగా ఇచ్చిన రూ.40 వేలను తిరిగి లాక్కున్నారు. ఈ గందరగోళాన్ని చూసి మురుగేషన్ అవాక్కయ్యాడు. జనం ఎక్కడ తన మీద విరుచుకుపడతారో అనే భయంతో పత్తా లేకుండా పోయాడు.

మరిన్ని వార్తలు