హెలికాప్టర్ ను రిపేరు చేసిన కారు మెకానిక్

4 Nov, 2016 17:43 IST|Sakshi
హెలికాప్టర్ ను రిపేరు చేసిన కారు మెకానిక్

న్యూఢిల్లీ: హెలికాప్టర్ ను కారు మెకానిక్ తో రిపేరు చేయించిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత హెలికాప్టర్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో డీజీసీఏ ఘటనపై విచారణకు ఆదేశించింది. కాగా విచారణలో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. డీజీసీఏ తెలిపిన వివరాల ప్రకారం.. ముంబైలోని ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన అగస్లా వెస్ట్ ల్యాండ్ ఏడబ్ల్యూ-109ను ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెన్స్ ఇంజనీర్(ఏఎమ్ఈ)తో కాకుండా ఓ కార్ మెకానిక్ తో రిపేరు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయని చెప్పింది.

గత నెల 12వ తేదీన గోవా నుంచి పూణె(వయా కొల్హాపూర్)కు హెలికాప్టర్ వెళ్లినట్లు తెలిపింది. మధ్యలో కొంతసేపు కొల్హాపూర్ లో హెలికాప్టర్ ను పైలట్ నిలిపినట్లు చెప్పింది. ఆ సమయంలో తీసిన ఫోటోల్లో హెలికాప్టర్ ఇంజన్ ను కారు మెకానిక్ రిపేర్ చేసినట్లు స్పష్టంగా ఉన్నట్లు పేర్కొంది.

ఇంజన్ లో తలెత్తిన లోపాన్ని సరిచేసేందుకు అతను ప్రయత్నించి ఉండొచ్చని డీజీసీఏ అధికారి ఒకరు పేర్కొన్నారు. చాపర్ పైలట్ ను విధుల నుంచి తొలగించినట్లు ఆయన తెలిపారు. హెలికాప్టర్ ఇంజిన్ ను మెకానిక్ ఏం చేశాడనే దానిపై విచారణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు