మా తపనంతా పిల్లల గురించే...

15 Jul, 2015 02:41 IST|Sakshi
మా తపనంతా పిల్లల గురించే...

క్రీడా మైదానాలు ఉండడం లేదని హైకోర్టు ఆవేదన

శివాజీపార్కు లేకుంటే గవాస్కర్, సచిన్ గొప్ప క్రికెటర్లు అయ్యేవారా?
ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణంపై కోర్టు వ్యాఖ్య
పిల్లలు ఆడుకోవడానికి ఎంత స్థలం కేటాయిస్తారో చెప్పండి
టీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం.. విచారణ 20కి వాయిదా

 
హైదరాబాద్: ప్రజలకు అనేక రకాలుగా ఉపయోగపడుతున్న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కళాభారతి నిర్మాణం చేపట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం తప్పు చేస్తోందని అనలేమని హైకోర్టు వ్యాఖ్యానించింది. తమ తపన ఎన్టీఆర్ స్టేడియంలో వాకింగ్ చేస్తున్న ప్రజల గురించి కాదని, పిల్లల గురించేనని స్పష్టం చేసింది. నగరీకరణ నేపథ్యంలో చిన్నారులు ఆడుకోవడానికి సరైన మైదానాలు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ముంబైలో శివాజీ పార్కు లేకుంటే గవాస్కర్, సచిన్ గొప్ప క్రికెటర్లు అయ్యేవారా.. వారు  ప్రపంచస్థాయి క్రీడాకారులు అయ్యారంటే అది ఆ మైదానం ఘనతే. చిన్నప్పుడు నేను కూడా అక్కడే ఆడుకున్నా. హైదరాబాద్‌లోనూ క్రీడామైదానాలు ఉండి తీరాలి.’ అని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే వ్యాఖ్యానించారు. స్టేడియంలో కళాభారతి నిర్మాణం పోను పిల్లలు ఆడుకునేందుకు ఎంత స్థలం కేటాయిస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. స్టేడియం పక్కనే ఉన్న కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్థలాన్ని క్రీడా మైదానంగా మార్చే అవకాశాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచిం చింది. ఈ వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ దిలీప్ బి.బొసాలే,  జస్టిస్ ఎస్.వి. భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎన్టీఆర్ స్టేడియానికి చెందిన 14 ఎకరాల భూమిని కళాభారతి నిర్మాణం కోసం సాంస్కృతిక శాఖకు అప్పగిస్తూ గత నెల 23న పురపాలకశాఖ జారీ చేసిన జీవో 73ను సవాలు చేస్తూ ఇందిరాపార్క్ వాకర్స్ అసోసియేషన్ డాక్టర్ ఎ.సుధాకర్ యాదవ్ హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం తాజాగా మంగళవారం దీనిని మరోసారి విచారించింది. 14 ఎకరాల భూమిలో ఎంత విస్తీర్ణంలో కళాభారతి నిర్మిస్తున్నారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ప్రశ్నించింది. 6 ఎకరాల్లో కళాభారతి నిర్మాణం జరుగుతుందని, మిగిలిన స్థలాన్ని వదిలేస్తామని, దానిని వాకర్లు వాడుకోవచ్చని రామకృష్ణారెడ్డి తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ... ‘హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ తపన మంచిదే. ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూడాలన్న భావనతో ఉన్న ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో కళాభారతిని నిర్మిస్తున్నట్లు చెబుతోంది. ఇందులో తప్పేమీ లేదు.

కాని మైదానాలు లేకపోతే పిల్లల పరిస్థితి ఏమిటో ఆలోచించాలి..’ అని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.సత్యంరెడ్డి జోక్యం చేసుకుంటూ, ఎన్టీఆర్ స్టేడియం పక్కనే కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉందని.. అందులోని విద్యార్థులు సైతం ఎన్టీఆర్ స్టేడియంలోనే ఆడుకుంటారని తెలి పారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ఆ కాలేజ్ స్థలాన్ని కూడా పిల్లలు ఆడుకునేందుకు అందుబాటులోకి తెస్తే బాగుంటుంది కదా.. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించండని ఏజీకి స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహా రంలో తాము కోరిన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
 

మరిన్ని వార్తలు