మోడీ- సామాజిక కార్యకర్త, రాహుల్ గాంధీ..?

31 Jul, 2014 14:27 IST|Sakshi
మోడీ- సామాజిక కార్యకర్త, రాహుల్ గాంధీ..?

నరేంద్ర మోడీ- సామాజిక కార్యకర్త, ఎల్ కే అద్వానీ- జర్నలిస్ట్, రాజ్నాథ్ సింగ్- టీచర్, మురళీ మనోహర్ జోషి- ప్రొఫెసర్, సోనియా గాంధీ- రాజకీయ, సామాజిక కార్యకర్త, రాహుల్ గాంధీ- వ్యూహ సలహాదారు(స్ట్రాటజీ కన్సల్టెంట్)... ఏమిటీ అగ్ర నాయకులందరూ రాజకీయాలు వదిలేసి ఇలా ఎప్పుడు మారిపోయారని అనుకుంటున్నారా. కంగారు పడకండి వీరంతా రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు.

రాజకీయాల పరంగా కాకుండా మిమ్మల్ని మీరు ఎలా నిర్వచించుకుంటారన్న ప్రశ్నకు ఆయా నాయకులు ఇచ్చిన సమాధానాలివి. ఈ జాబితాను పార్లమెంట్ వెబ్సైట్ లో పెట్టారు. 16వ లోక్సభలో ఉన్న 539 మంది ఎంపీలను ఆయా వృత్తులు పరంగా 33 విభాగాల కింద పొందుపరిచారు. ఇందులో వ్యవసాయదారులు, బిల్డర్లు, వైద్యులు, విద్యావేత్తలు, టీచర్లు, క్రీడాకారులు, కళాకారులు, మతబోధకుడు, సామాజిక సంస్కర్తలు ఉన్నారు.

లోక్సభ ఎన్నికల్లో తాను రచించిన వ్యూహాలు ఘోరంగా విఫలమైనా రాహుల్ గాంధీ తనను స్ట్రాటజీ కన్సల్టెంట్ గా చెప్పుకోవడం విశేషం. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు, బర్హంపూర్ ఎంపీ ఆదిర్ రాజన్ చౌదరీ.. తాను సామాజిక సంస్కర్తగా పేర్కొనడం మరీ విడ్డూరం. ఎందుకంటే ఆయనపై ఎన్నో క్రిమినల్ కేసులున్నాయి. భారత టెస్టు క్రికెటర్ కీర్తి ఆజాద్- క్రీడాకారుడిగా చెప్పుకోవడానికే ఇష్టపడ్డారు. ఇక యువ ఎంపీ అనురాగ్ థాకూర్ ఒక్కరే క్రికెటర్ గా చెప్పుకున్నారు.

శశి థరూర్ తనను తాను దౌత్యవేత్తగా పరిచయం చేసుకున్నారు. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ ఒక్కరే మత బోధకుడిగా చెప్పుకున్నారు. పూనమ్ మహాజన్- బిజినెస్ పర్సన్-గా, మేనకా గాంధీ- రచయితగా, సౌగతా రాయ్-విద్యావేత్తగా తమను తామను నిర్వచించుకున్నారు. సుష్మా స్వరాజ్, సుమిత్రా మహాజన్ లు న్యాయవాద వృత్తిపై మక్కువ చూపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా-రాజకీయ, సామాజిక కార్యకర్తగా ఉండడానికి ఇష్టపడ్డారు.

మరిన్ని వార్తలు