స్నేహితుడి కంటే ద్రోహి ఉంటాడా!

7 Aug, 2016 13:28 IST|Sakshi
స్నేహితుడి కంటే ద్రోహి ఉంటాడా!

'వెంటే ఉండే స్నేహితులు మనల్ని సులువుగా వెన్నుపోటు పొడవగలరు. అదే శత్రువైతే కనీసం ముందునుంచి పొడిచే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి శత్రువుల కంటే స్నేహితులే అతిపెద్ద ద్రోహులు. చరిత్రలో అడుగడుగునా అలాంటి ఉదాహరణలెన్నో కనబడతాయి. గొప్ప స్నేహితులుగా చరిత్రకెక్కిన సీజర్, బ్రూటస్ల కథ ఏమైంది? నమ్మిన బ్రూటస్.. సీజర్ వెన్నులో కత్తిదించి చంపలేదా! ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సీజర్కు బ్రూటస్ శుభాకాంక్షలు చెబితే అంతకన్నా దారుణం ఉంటుందా!

స్నేహం ఎంత చెడ్డదో నా సినిమాల్లో చూపిస్తూఉంటా. ఒక్కసారి సాయం చేస్తే స్నేహితుడు పదేపదే మన దగ్గరికే వస్తాడు. కాబట్టి స్నేహితులకు హెల్ప్ చెయ్యొద్దు. ఈ లోకంలో నమ్మకద్రోహం, మోసం, బాధ.. అన్నింటికి కారణం స్నేహం, స్నేహితులే! అందుకే నేను.. స్నేహితుల కన్నా శత్రువులనే ప్రేమిస్తాను. నాకు వ్యతిరేకంగా కుట్రలుపన్నే శత్రువులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నా. దేవుడు నా శత్రువులను కాపాడుగాక' అంటూ స్నేహితుల దినోత్సవం సందర్భంగా తనదైన శైలిలో స్నేహానికి నిర్వచనం చెప్పాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. శత్రువులకు ఫ్రెండ్ షిప్ డే విషెస్ చెప్పడం బాగుందికదా!

వర్మ పేర్కొన్న బ్రూటస్ గాథ ఏంటంటే..
ప్రాచీన చరిత్రలో రోమన్ రాజ్యంలోని బ్రూటస్‌కు మించిన నమ్మకద్రోహి మరెవరూ కనిపించరు. రోమన్ చక్రవర్తి జూలియస్ సీజర్‌కు నమ్మకమైన ఆంతరంగికుడిగా ఉండేవాడు. అంతటి ఆంతరంగికుడు వెన్నుపోటు పొడుస్తాడని ఎవరూ ఊహించలేరు. పాపం... వెన్నులో కత్తి దిగేంత వరకు సీజర్ కూడా ఊహించలేకపోయాడు. ‘నువ్వు కూడానా బ్రూటస్...’ అని ఆక్రోశంతో వాపోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు.
జూలియస్ సీజర్ నియంతగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని సెనేటర్లు అతడిపై కుట్ర పన్నారు. సీజర్‌కు అత్యంత సన్నిహితుడుగా ఉండే బ్రూటస్‌ను తమతో కలుపుకుంటే తప్ప తమ కుట్రను అమలు చేయడం సాధ్యం కాదని తలచి, అతడిని తమతో కలుపుకున్నారు. సీజర్ సెనేట్‌లో అడుగుపెట్టిన మరుక్షణమే అతడిపై విరుచుకుపడ్డారు. బ్రూటస్ నమ్మకద్రోహానికి సీజర్ దారుణంగా బలైపోయాడు. (తప్పక చదవండి: నమ్మకపోటు)

మరిన్ని వార్తలు