కృష్ణాతీరం... సినిమా కేంద్రం | Sakshi
Sakshi News home page

కృష్ణాతీరం... సినిమా కేంద్రం

Published Sun, Aug 7 2016 12:59 PM

కృష్ణాతీరం... సినిమా కేంద్రం - Sakshi

తెలుగు సినిమా పరుగులు నేర్చి ఏడు దశాబ్దాలైంది. ఆరంభ దశ నుంచి నేటి దాకా బెజవాడ... సినిమా పరిశ్రమకి ముఖ్య కేంద్రంగా నిలిచింది. తొలితరం నిర్మాతలు, దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులు కృష్ణాతీరం వారే! సినిమా ఆనాడు సరికొత్త సాంకేతిక విజ్ఞానం. మూకీల నాడే ఎల్.వి.ప్రసాద్ అనబడే అక్కినేని లక్ష్మీవరప్రసాద్ చిన్నతనాన్ని, బంగారు కలల్ని వెంటవేసుకుని బొంబాయి పారిపోయారు. తిరిగి వచ్చేటప్పుడు సినిమా నాలెడ్జిని వెంట తెచ్చారు. ఎల్.వి.ప్రసాద్ దర్శకుడుగా, నటుడుగా, నిర్మాతగా, లాబొరేటరీ యజమానిగా రాణికెక్కారు.  
 
గూడవల్లి రామబ్రహ్మం సామాజిక స్పృహతో చిత్రాలు నిర్మించి పేరు తెచ్చుకున్నారు. కెయస్. ప్రకాశరావు, కె.రాఘవేంద్రరావు సినిమాని పరిశ్రమగా తీసుకున్నారు.  కె.విశ్వనాథ్ కనక వర్షాలు కురిపించిన కళాత్మక సినిమాలకు మారుపేరు అయ్యారు. విజయవాడలో పుట్టి పెరిగిన జె.వి.డి.ఎస్ అనే జంధ్యాల తెలుగు సినిమాకి చక్కలిగింతలు పెట్టి, తెలుగు ప్రేక్షకుల్ని నవ్వులలో ముంచెత్తారు.

ఆయన రచయిత, దర్శకుడు మాత్రమే కాదు, మంచి నటుడు కూడా. దర్శకులు ఘంటసాల బలరామయ్య దృష్టి సోకి, కథానాయకుడిగా చలనచిత్ర చరిత్రలో నిలిచారు అక్కినేని నాగేశ్వరరావు. అక్కినేని ఏ మహత్తర క్షణంలో తొలిసారిగా మేకప్ వేసుకున్నారో గాని, ఇప్పటికీ మూడోతరం కథానాయకులుగా అక్కినేని వారసులు చలాయిస్తున్నారు. నిర్మాత, పంపిణీదారుడు, స్టూడియో యజమాని. ఇంకా దేశంలోనే సుదీర్ఘ నట జీవితం గడిపిన ధన్యజీవి.
 
తెలుగుతనానికే ప్రతీకగా నిలిచిన నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు. నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని, వెండితెరపై ఇప్పుడు మూడో తరం విజయవంతంగా నడుస్తోంది. స్టూడియో, సినిమా థియేటర్లు, నిర్మాణసంస్థ, పంపిణీ వ్యవస్థలను యన్టీఆర్ నెలకొల్పారు. రాజకీయాలలో ఆయనదొక శకం. 1947లో ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ అనే నాటక సంస్థ ఆవిర్భవించింది. అందులో ఎన్.టి.రామారావు, ఎన్. త్రివిక్రమరావు, ఎ. పుండరీకాక్షయ్య, రోజులు మారాయి ఫేమ్ వ హీదా రెహమాన్, సావిత్రి లాంటి వారు అనేక నాటకాలు ప్రదర్శించి ప్రజాభిమానం చూరగొన్నారు.

తరువాత ఎన్.ఎ.టి. చిత్ర నిర్మాణ సంస్థగా రూపొందింది. ప్రముఖ దర్శకులు విక్టరీ మధుసూదనరావు విజయవాడ ఆంధ్రా ఆర్ట్స్ థియేటర్ నుంచి వచ్చారు. ఇంకా మిక్కిలినేని రాధాకృష్ణ, రక్తకన్నీరు నాగభూషణం ఆ థియేటర్ వారే. కృష్ణాతీరంలో, విజయవాడలో వచ్చిన నాటక సంస్థలు సినిమా పరిశ్రమకు నటీనటులను, దర్శకులను అందించాయి. 1929లో గుడివాడలో ఆంధ్ర నాటక కళాపరిషత్ ఆరంభమైంది. దుక్కిపాటి మధుసూదనరావు అక్కడివారు. ఆనక అన్నపూర్ణా సంస్థను పేరు ప్రతిష్ఠలతో నడిపించారు.
 
 నాలుగు దశాబ్దాలకు పైబడి నలుగురు కథానాయకులు చిత్ర కళా మండపానికి నాలుగు స్తంభాలుగా నిలిచారు. వారు ఏయన్నార్, యన్టీఆర్, శోభన్‌బాబు, కృష్ణ. ఈ దిగ్గజాలన్నీ విజయవాడ పరిసరాలవారు అవడం ఒక విశేషం. నటుడిగా, విద్యాధికునిగా వాసికెక్కిన కొంగర జగ్గయ్య ఈ ప్రాంతం వారే. కామెడీ హీరోగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రాజేంద్రప్రసాద్.

విలక్షణ నటుడిగా కోట శ్రీనివాసరావు పేరు తెచ్చుకున్నారు. పెద్దరికపు పాత్రలలో రాణించిన అన్నపూర్ణ విజయవాడ మజిలీ నుంచే మద్రాసు వెళ్లారు. నటవిశారద శారద తెనాలి నుంచి విజయవాడ మీదుగా వెండితెరకు ఎక్కారు. తెనాలి పేరు చెబితే కాంచనమాల, లక్ష్మీరాజ్యం గుర్తు రాకుండా ఉండరు. విజయవాహిని సంస్థకు చుక్కాని చక్రపాణి తెనాలి వాస్తవ్యులు. సీతామాలక్ష్మి లాంటి అభిరుచి గల సినిమాలతో నిర్మాత అవతారం యెత్తిన కాట్రగడ్డ మురారిది విజయవాడ సెంటరు.

ఎన్ని పేర్లు చెప్పినా ఇంకా కొందరు చెప్పక మిగిలే వుంటారు. చిత్ర పంపిణీ సంస్థలన్నీ విజయవాడలోనే వుండేవి. వాటికి అనుబంధంగా అనేక చిరు పరిశ్రమలు యిక్కడ  నుంచే నడిచేవి. మద్రాస్‌లో రూపాయలు జల్లి విజయవాడలో ఏరుకుంటారని సామెత.
 
 పలు సినిమాలకు కథలు అందించిన యద్దనపూడి సులోచనారాణి స్వస్థలం బెజవాడ పక్కన కాజ. కృష్ణవేణి సముద్రుని చేరే హంసలదీవికి కూతవేటు దూరంలో ఆ దివ్య జలధారల జీరల సౌకుమార్యాన్ని కంఠాన ధరించి జన్మించిన సంగీత శక్తి ఎస్.జానకి. నాదస్వరానికి ఆమె గళం మధురిమలు, సరిగమలు నేర్పింది. తెలుగు సినిమా పాటకు కొత్త మాటలు నే ర్పిన వేటూరి సుందరరామమూర్తి దివిసీమ వాసి.

తరాలుగా తెలుగువారిని తన గాంధర్వ గానంతో అలరించిన ఘంటసాల ఇక్కడి వారే. చిరుత ప్రాయంలోనే దక్షిణాది సంగీత వేదికలను అలంకరించిన బాలమురళీకృష్ణ తగిన సంఖ్యలో సినిమా పాటలు పాడారు. పద్యాలంటే ఆయనే అనిపించుకున్నారు మాధవపెద్ది సత్యం. ఇలాంటి విశేషాలు ఎన్ని రాసినా సశేషం వుండనే వుంటుంది. విజయవాడ గాంధీనగరం సినిమా వాసనలతో వుండేది.
 
 ఇప్పుడు వ్యాపార తీరు మారి ఆ జోరు తగ్గింది. బెజవాడలో మారుతీ టాకీస్ అత్యంత ప్రాచీనమైంది. అన్నిటికీ తోడు పత్రికలన్నీ విజయవాడలోనే వుండడం వల్ల సినిమా పబ్లిసిటీలకు ముఖ్య కేంద్రమైంది. సినిమా విజయంలో ‘బెజవాడ టాక్’ చాలా కీలకమైంది. ఒక్కోసారి కొన్ని అద్భుతాలు కూడా బహుళ ప్రచారంలో వచ్చేవి. పాతకాలంలో - రోజులు మారాయి సినిమా విడుదలైంది. అప్పుడప్పుడే అందుకుని బాగా నడుస్తోంది.

ఉన్నట్లుండి సాక్షాత్తూ కనకదుర్గమ్మ రోజులు మారాయి సినిమాకి వచ్చి చూసి వెళ్లిందని బెజవాడలో కథలు కథలుగా చెప్పుకున్నారు. కనకదుర్గమ్మ రిక్షాలో వచ్చిందట. దిగి వెళ్తుంటే రిక్షావాలా డబ్బులు అడిగితే వెనక్కి చూడకుండా వెళ్లిపోయిందట. రిక్షావాలా కోపంగా తలపాగా తీసి విదిలించాడట. పదిరూపాయల నోట్లు జలజలా రాలాయిట! ఆ తర్వాత వారం పదిరోజులు ఆ సినిమాకి టిక్కెట్లు దొరకలేదుట!
 ఇలా ఎన్నో తమాషాలు!!!
 - శ్రీరమణ

Advertisement
Advertisement