అమ్మో అంత బంగారమా?

7 May, 2015 14:50 IST|Sakshi
అమ్మో అంత బంగారమా?

(సాక్షి వెబ్ ప్రత్యేకం)

పండలైనా, శుభకార్యాలైనా స్వర్ణ కాంతులు విరాజిల్లాల్సిందే. ముఖ్యంగా పడుతులకు పసిడిపై మక్కువ అధికం. కాసు కాంచనమైనా లేకుండా గడప దాటరు కాంతలు. ఇక పండగలు, శుభకార్యాల్లో అయితే నిండుగా నగానట్రా ఉండాల్సిందే. ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఒంటినిండా నగలతో నడిచొచ్చే నారీమణులను మోడ్రన్ మహాలక్ష్ములే. ఆ మాటకొస్తే గోల్డ్ పై మక్కువచూపే మగవాళ్లు తక్కువేం కాదు. ఒళ్లంతా కాకపోయినా వీలున్నంత మేర స్వర్ణమయం చేసుకునే పురుషులు ఉన్నారు.

మనదేశంలో ఉన్నంత బంగారం మరెక్కడా లేదని అనధికారిక అంచనా. జనం దగ్గర ఉన్న గోల్డ్ కు అయితే లెక్కేలేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్ లో స్వయంగా వెల్లడించారు. గత మూడేళ్లలో పసిడి దిగుమతులపై విదేశీ మారకద్రవ్యం ఎంతమేరకు ఖర్చుచేశారని అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అయితే కొన్ని నివేదిక ప్రకారం ప్రజల వద్ద 20 వేల టన్నుల బంగారం ఉన్నాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుత ధర ప్రకారం దీని విలువ సుమారు రూ.54 లక్షల కోట్లు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 2014, నవంబర్ లో 80:20 నిబంధన ఎత్తివేశాక గోల్డ్ ఇంపోర్ట్స్ స్థిరంగా పెరుగుతూ వచ్చాయని వెల్లడించారు.

జనం వద్ద ఉందని అంచనా కడుతున్న కాంచనంతో పోలిస్తే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద బంగారం నిల్వలు చాలా స్వల్పం. ఆర్ బీఐ వద్ద 5 లక్షల కిలోల గోల్డ్ నిల్వలు ఉన్నాయి. 2014-15లో బంగారం దిగుమతి కోసం ఖర్చు చేసిన మారకద్రవ్యం 34.41 బిలియన్ డాలర్లు(సుమారు రూ.2 లక్షల కోట్లు), 2012-15లో ఇది 53.82 బిలియన్ డాలర్లు(సుమారు రూ.3 లక్షల కోట్లు)గా ఉంది. ఇక సగటు వార్షిక సువర్ణ దిగుమతులు 8-9 లక్షల కేజీలుగా ఉన్నాయి.  

పండగలు, శుభాకార్యలకు బంగారం కొనడం భారతీయులకు అలవాటు. అలంకరణ వస్తువుగానే కాకుండా ఆర్థిక అవసరాల్లో ఆదుకుంటాయనే భావనతో స్వర్ణాభరణాలపైపు మొగ్గుచూపుతుంటారు. ఇన్వెస్ట్ మెంట్ గానూ గోల్డ్ కొంటుంటారు మనవాళ్లు. అందుకే చేతిలో ఏమాత్రం డబ్బు ఉన్నా బంగారం షాపులకు బయలుదేరతారు. అందుకేనేమో మనవాళ్ల దగ్గర 2 కోట్ల కిలోల బంగారం కొండ ఉంది. ఏమైనా మనవాళ్లు బంగారం!!

-పీఎన్ఎస్సార్

మరిన్ని వార్తలు