నియామకాల్లో సింగరేణి ఆదర్శం

22 Aug, 2015 01:30 IST|Sakshi
నియామకాల్లో సింగరేణి ఆదర్శం

గోదావరిఖని: సింగరేణి సంస్థ వేగవంతంగా, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపడుతూ రాష్ట్రంలోని మిగతా సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే రెండు నోటిఫికేషన్లు వెలువరించిన సంస్థ వెంటవెంటనే పరీక్షలు నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించి రికార్డు సృష్టించింది. అవినీతి, జాప్యానికి తావిచ్చే ఇంటర్వ్యూకు స్వస్తిపలికి రాత పరీక్ష మాత్రమే నిర్వహిస్తూ ఉద్యోగ నియామకాలు చేపడుతున్న ఏకైక సంస్థగా మన్ననలు పొందుతోంది. తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల వారికి 80 శాతం, ఇతర జిల్లాలవారికి 20 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నియామకాలను చేపడుతున్న తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది.
 
2,254 ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు: సింగరేణిలో యాజమాన్యం రెండుసార్లు నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొదటి నోటిఫికేషన్‌లో పేర్కొ న్న ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి రాతపరీక్షలను ప్రారంభించింది. ఇందులో భాగంగా మొత్తం 1,178 ఉద్యోగాలకు రాతపరీక్ష నిర్వహించింది. రెండవ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా మొత్తం 394 పోస్టులకు ఈ నెల 9న రాత పరీక్ష నిర్వహించారు.
 
సెప్టెంబర్ నాటికి 682 ఉద్యోగాల భర్తీ: సింగరేణి సంస్థ సెప్టెంబర్ నాటికి మరో 682 ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు చేపట్టింది. రెండవ నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధం గా ఈ నెల 16న 30 సబ్ ఓవర్‌సీర్ (సివిల్) ఉద్యోగాలకు, 30న 45 సర్వేయర్ ట్రైనీ ఉద్యోగాలకు రాతపరీక్షను నిర్వహించనున్నది. అలాగే 40 మోటార్ మెకానిక్ పోస్టులు, 48 మైన్ సర్వేయర్ పోస్టులు, మరో 48 సర్వేయర్ ట్రైనీ పోస్టులు, 471 గ్రేడ్-2 క్లర్క్ పోస్టులకు సెప్టెం బర్‌లోగా రాత పరీక్షను నిర్వహించేలా  రిక్రూట్‌మెంట్ సెల్ చర్యలు తీసుకుంటోంది.
 
పరీక్ష నిర్వహించిన రోజే ఫలితాలు: సింగరేణి యాజమాన్యం పరీక్ష పేపర్‌ను తయారు చేసే వారిని వారం రోజులకు ముందుగానే బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉంచుతోంది. వారుండే చోట సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు.  ఆయా ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించిన రోజే ఫలితాలను వెల్లడించడంతో పాటు వాటిని అదే రోజు రాత్రికి వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతోంది.

మరిన్ని వార్తలు