నిండని చెరువులకు నిధులెందుకు!

11 Jan, 2016 03:59 IST|Sakshi
నిండని చెరువులకు నిధులెందుకు!

80 శాతం చెరువులు పెద్ద వానలొచ్చినా నిండట్లేదు
* అలాంటి వాటిల్లో పూడికతీత నిరర్థకమే
* తూముకు షట్టర్, కాల్వలకు లైనింగ్ చేస్తేనే ఆయకట్టుకు ఎక్కువ ప్రయోజనం   
* డెడ్‌స్టోరీజీలో పూడికతీతతో చేటు
* రెండో విడత మిషన్ కాకతీయలో దీనిపై దృష్టి పెట్టాలి
* నీటి పారుదలరంగ నిపుణుడు టి.హనుమంతరావు సూచనలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంచి వానలు కురిసిన రోజుల్లోనూ 80 శాతం చెరువులు నిండటం లేదని, అలాంటి చెరువులను మిషన్ కాకతీయ పనుల్లో చేర్చి పూడిక తీయడం నిరర్థకమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కేవలం 20 శాతం చెరువులే వానలు వచ్చినప్పుడు నిండుతుంటాయని, వాటిని గుర్తించి, అందులోనే పూడికతీత ద్వారా నిల్వ సామర్థ్యాన్ని పెంచితే ప్రయోజనకరంగా ఉంటుందనే వాదన వినవస్తోంది. ‘ప్రస్తుతం రాష్ట్రంలో నిండే చెరువులు, నిండని చెరువులన్నింటినీ ఒకే గాటిన కట్టి నిధులు కేటాయించి పనులు చేయిస్తున్నారు. ఇది వృథా ప్రయాసే. అలాకాకుండా నిండే చెరువులను గుర్తించి పూడిక తీస్తే ఫలితాలుంటాయి’ అని నీటిపారుదల రంగ నిపుణుడు రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ టి.హనుమంతరావు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. పూడిక ఎక్కడ తీయాలన్న దానిపైనా కనీస అవగాహన లేకుండా పనులు చేస్తున్నారని, నీటి వృథాను అరికట్టే చర్యలు ఉండటం లేదన్నారు.

కోట్ల రూపాయల ప్రతిపాదనలతో మిషన్ కాకతీయ రెండో విడత ఆరంభమవుతున్న తరుణంలో చెరువుల కింద అదనపు ఆయకట్టు ఇచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నీటి ఆదా ఎలా చేయాలన్న దానిపై టి.హనుమంతరావు పలు కీలక సూచనలు చేశారు. అవి ఆయన మాటల్లోనే...
 
తూము కాల్వలకు లైనింగ్ తప్పనిసరి
తూము నుంచి పంటపొలాలకు నీటిని పంపిణీ చేసే కాల్వలకు సిమెంట్ లైనింగ్ అత్యంత ముఖ్యం. దీనిద్వారా నీటి వృధా అరికట్టి రెట్టింపు ఆయకట్టుకు నీరివ్వొచ్చు. దీంతోపాటే చెరువుకు నీరు రావాలంటే సరఫరా కాల్వలు (సప్లై చానల్స్) లేవన్న వాదన ఉంది. ఇది అపోహ మాత్రమే. చెరువుల్లో నీరు రావాలంటే పరీవాహకంలో వర్షాలు కురిస్తే ఆ నీరంతా చెరువులో నే చేరుతుంది. ఇది నైసర్గికంగా జరిగే ప్రక్రియే. దీనికి కొత్తగా సప్లై చానల్స్ అని పేరు పెట్టి వాటిని పునరుద్ధరిస్తామంటే అది వృథా ప్రయాసే.
 
డెడ్ స్టోరేజీలో పూడికతో ఫలితం లేదు
ప్రస్తుతం మిషన్ కాకతీయలో భాగంగా చెరువు ముంపులో తూము మట్టానికి దిగువన ఉండే నేల ప్రాంతమైన డెడ్ స్టోరేజీలో పూడిక తీస్తున్నారు. తూము మట్టం కన్నా పైన ఉన్న భాగంలో పూడిక తీసినట్లయితేనే చెరువు సామర్థ్యం పెంచినట్లవుతుంది. అలా అయితేనే ఎక్కువ నీటిని పంటలకు ఇచ్చే అవకాశం ఉంది. అయితే డెడ్ స్టోరేజీ వద్ద సత్తువ కలిగిన మట్టి లభ్యత ఉన్నందున రైతులు దీనిపైనే మొగ్గు చూపుతుండటంతో, అధికారులు పనులు అక్కడే చేయిస్తున్నారు. దీనివల్ల రైతులకు ప్రయోజనం కలిగినా చెరువుకు ప్రయోజనం ఉండదు.
 
షట్టర్ ఏర్పాటుతో ఆయకట్టు రెట్టింపు
ప్రస్తుతం చెరువు తూములను రాళ్లు, మట్టి, గడ్డితో మూయడం, తెరవడం చేస్తున్నారు. ఒకసారి తూమును తెరిస్తే, ఆయకట్టుకు అవసరం లేకున్నా, చెరువు ఖాళీ అయ్యేదాకా నీరు పారుతూనే ఉంటుంది. మళ్లీ దాన్ని మూసినా నీటి వృధా ఆగదు. ఈ దృష్ట్యా నీటి వృథాను అరికట్టేందుకు తూముకు స్క్రూగియరింగ్ షట్టర్ (మర  తిప్పడం ద్వారా తెరుచుకోవడం, మూసుకోవడం) ఏర్పాటు చేయాలి. అలా అయినే నీటి ఆదా పెరిగి రెట్టింపు ఆయకట్టుకు నీటిని అందించవచ్చు. ఖర్చు సైతం రూ.15 వేలకు తక్కువే ఉంటుంది.
 
గండ్ల నివారణకు చర్యలు అవసరం
ఇక మంచి వర్షాలు కురుస్తున్న సమయంలో చెరువులు తెగిపోతున్నాయి. గండ్లు పడుతున్నాయి. ప్రస్తుత ఏడాదిలో రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్న సమయంలో వరంగల్, ఖమ్మం జిల్లాల్లో చెరువులకు గండ్లు పడ్డాయి. ముఖ్యంగా చెరువు ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవల్) నుంచి కట్ట పైభాగం వరకు అలల తాకిడి ఎక్కువైనప్పుడు, మట్టి కరిగి కొట్టుకుపోతుంది.

కొన్నాళ్ల తర్వాత కట్ట కోతకు గురై వరద వచ్చినప్పుడు తెగుతుంది. దీన్ని నివారించాలంటే మొదటగా చెరువు కట్ట లెవల్ (టాప్ ఆఫ్ బండ్) పెంచాలి. చెరువుగట్టు స్లోప్‌లో కట్టే రివెట్‌మెంట్ (రాతికట్టుడు)ను చెరువు ఎఫ్‌టీఎల్‌ను దాటి టాప్ ఆఫ్ బండ్ వరకు కట్టాలి. వరద పోయే పరిమాణానికి అనుగుణంగా అలుగు నిర్మాణం ఉండాలి.

మరిన్ని వార్తలు