పింఛన్ లేకున్నా.. ఇల్లుంటే చాలు!

20 Oct, 2013 01:22 IST|Sakshi
పింఛన్ లేకున్నా.. ఇల్లుంటే చాలు!

సీనియర్ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టిన రివర్స్ మార్టిగేజ్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. సొంతింటిలోనే ఉంటూ, ఆ ఇంటిపై ప్రతి నెలా అద్దె రూపంలో (నిజంగా అద్దె కాదు... రుణం) కొంత మొత్తం వచ్చే ఈ రివర్స్ మార్టిగేజ్ పథకం ఇప్పటిదాకా గరిష్టంగా 20 ఏళ్లు మాత్రమే వర్తించేది. ఇపుడు జీవితాంతం వర్తించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది.
 
 ఆనందరావు ప్రైవేటు ఉద్యోగి. రిటైరయ్యాడు. కొడుకులిద్దరూ ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్లారు. అక్కడే సెటిలయ్యారు. ప్రైవేటు ఉద్యోగి కావటంతో తను ఏర్పాటు చేసుకున్న పింఛన్ చాలా తక్కువ. ఆత్మాభిమానం ఎక్కువ కావటంతో కొడుకుల్ని కూడా అడగలేకపోతున్నాడు. హైదరాబాద్‌లోని సొంతింట్లో ఉండే ఆనందరావుకు ఏం చేయాలో అర్థంకాలేదు. ధరలు పెరగటంతో చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే విషయాన్ని తన స్నేహితుడు కుటుంబరావుకు చెప్పాడు. ‘‘నువ్వు సంపాదించుకున్న ఇల్లేగా! నీక్కూడా పనికిరాకపోతే ఎలా? అందుకని తనఖా పెట్టు’’ అని సలహా ఇచ్చాడు కుటుంబరావు. ‘మరి నేనెక్కడుండాలి?’ అడిగాడు ఆనందరావు. ‘‘నువ్వు నిక్షేపంలా నీ ఇంట్లోనే ఉండొచ్చు. అలా ఉంటూనే నెలవారీ లేదా మూడు నెలలకోసారి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంత మొత్తం తీసుకోవచ్చు’’ అంటూ రివర్స్ మార్టిగేజ్ పథకాన్ని వివరించాడు. జీవితాంతం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడపటానికి వీలయ్యే రివర్స్ మార్టిగేజ్ పథకం వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...
 
 ఎలా పనిచేస్తుంది?
 మీ పేరుమీద ఉన్న ఇంటిని బ్యాంకు తన వద్ద తనఖాగా పెట్టుకొని ఆ ఇంటి విలువ ఆధారంగా కొంత మొత్తం వెనక్కి ఇస్తుంది. మీ అవసరాలకు అనుగుణంగా ప్రతి నెలా లేదా మూడు నెలలు, ఆరు నెలలు సంవత్సరానికి లేదా ఒకేసారిగా కూడా వెనక్కి తీసుకోవచ్చు.ఈ డబ్బులు మీకు బ్యాంకులు ఉచితంగా ఏమీ ఇవ్వవు. దీనిపై వడ్డీని వసూలు చేస్తాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు రివర్స్ మార్టిగేజ్‌పై బేసురేటుపైన రెండు నుంచి మూడు శాతం అధిక వడ్డీని వసూలు చేస్తున్నాయి. అంటే 12 నుంచి 13 శాతం వడ్డీ పడుతుందన్న మాట. ఈ  స్కీంలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే రుణం కాలపరిమితి తీరేంత వరకు మనం ఒక పైసా కట్టాల్సిన అవసరం ఉండదు. పెపైచ్చు మన ఇంట్లో మనమే ఉండొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మన గృహ రుణాలకు పూర్తి వ్యతిరేకంగా ఈ పథకం పనిచేస్తుంది. అందుకే దీన్ని రివర్స్ మార్టిగేజ్ స్కీంగా పిలుస్తున్నారు. కాలపరిమితి తీరిన తర్వాత మనం వాడుకున్న మొత్తం చెల్లిస్తే ఇల్లు తిరిగి మన చేతికి వచ్చేస్తుంది. లేకపోతే ఆ ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బుల్లో బాకీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని బ్యాంకు మనకు ఇచ్చేస్తుంది. ఒక వేళ రుణం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి మరణిస్తే వారసుడు (నామినీ) రుణం చెల్లించి ఇంటిని తీసుకోవచ్చు. లేకపోతే బ్యాంకు ఆ ఇంటిని అమ్మి బకాయిలు పోగా మిగిలిన మొత్తాన్ని వారసులకు అందచేస్తుంది.
 
 ఎంత ఇస్తారు?
 నేషనల్ హౌసింగ్ బోర్డు నిబంధనల ప్రకారం మీ ఇంటి విలువలో గరిష్టంగా 60 శాతం వరకు రుణం లభిస్తుంది. ఉదాహరణకు మీ ఇంటి విలువ కోటి రూపాయలు అనుకోండి మీకు సుమారు 60 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఇంత మొత్తం అవసరం లేదనుకున్నారనుకోండి.. మీ నెలసరి అవసరాలకు ఎంత డబ్బు అవసరమవుతుందో అంతే మొత్తానికి రుణం తీసుకోవచ్చు. నెలకు ఎంత వస్తుంది అనేది రుణ మొత్తం, ఎంచుకున్న కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. పై ఉదాహరణే తీసుకుంటే 10 ఏళ్ల కాలపరిమితి ఎంచుకుంటే ప్రతి నెలా రూ.25,200 చేతికి వస్తాయి. అదే 15 ఏళ్లు అయితే రూ.11,400, అదే 20 ఏళ్లు అయితే రూ.5,400 వరకు చేతికి వస్తాయి. ఇప్పుడు అమలులోకి వచ్చిన జీవిత కాలం నగదు కావాలనుకుంటే ఈ మొత్తం మరింత తగ్గుతుంది. అదే ఒకేసారి తీసుకుంటే మాత్రం చాలా బ్యాంకులు ఇంటి విలువ ఎంత అధికంగా ఉన్నా గరిష్టంగా రూ.15 నుంచి 20 లక్షల వరకు మాత్రమే ఇస్తున్నాయి.
 
 సీనియర్స్‌కి మాత్రమే..
 ఈ పథకాన్ని అందరూ తీసుకోలేదు. సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అది కూడా సొంత ఇల్లు ఉండి , 60 సంవత్సరాల వయసు దాటిన వారు మాత్రమే తీసుకోవడానికి అర్హులు. మీకు ఈ అర్హతలు ఉంటే మీ ఇంటిని బ్యాంకు తన దగ్గర తనఖా కింద పెట్టుకొని డబ్బులు ఇస్తుందన్నమాట. కాలపరిమితి కంటే ముందుగానే వాడుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేయొచ్చు. ఒకవేళ ఈ రుణాన్ని వేరే బ్యాంక్ టేకోవర్ చేస్తే మాత్రం రెండు శాతం వరకు పెనాల్టీలను విధిస్తున్నాయి. ఒకసారి రుణం మంజూరు చేసిన తర్వాత బ్యాంకు విధించిన నిబంధనలు నచ్చకపోతే 10 రోజుల్లోగా రద్దు చేసుకోవచ్చు. ఎటువంటి పెనాల్టీలు ఉండవు.
 
 అనేక ఆకర్షణలు
 అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ రివర్స్ మార్టిగేజ్ పథకానికి అర్హులు. మీ స్థిరాస్తి విలువలో గరిష్టంగా 60 శాతం వరకు రుణం లభిస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా నెలసరి వాయిదాలు, లేదా మూడు నెలలు, ఆరు నెలలకు ఒకసారి తీసుకునే సౌలభ్యం ఉంది. మీ స్థిరాస్తి విలువను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మదింపు చేస్తుంటారు. విలువలో ఏమైనా తేడా వస్తే దాని ప్రకారం మీకు చెల్లించే మొత్తంలో మార్పులు జరుగుతాయి. ఇలా ప్రతి నెలా వచ్చే మొత్తాన్ని ఆదాయంగా పరిగణించరు. ఆ మేరకు పన్ను భారం ఉండదు.
 - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం

మరిన్ని వార్తలు