ప్రభుత్వాల జోక్యంతో ప్రమాదం

14 Jul, 2015 00:29 IST|Sakshi
ప్రభుత్వాల జోక్యంతో ప్రమాదం

న్యాయమూర్తుల నియామకంపై జస్టిస్ చంద్రకుమార్
 
హైదరాబాద్: తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకోవాలనే ఆలోచన ప్రభుత్వాలకు ఉంటే భవిష్యత్‌లో న్యాయ వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రాజ్యాధికారం అనేది నిజాయితీ గల వ్యక్తులకు రావాలని ఆయన అభిలషించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ దేశంలో రాజకీయ అవినీతి పెరిగిపోయిందని, ముఖ్యమంత్రి నిజాయితీగా ఉంటే రాష్ట్రమంతా అలాగే ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం బాగా లేకుండా కింది స్థాయిలో బాగుండాలంటే సాధ్యం కాదన్నారు.

ఇటీవల కాలంలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, కేసు విచారణ జరుగుతున్న సందర్భంలో సాక్షులను హత్య చేస్తున్నారని, ఇది విచారకరమన్నారు. సాక్షులను హత్య చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ ఆర్.వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ప్రకాశ్, నమ్రిత జైశ్వాల్ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు