'మాంఝీ మాతో రండి'

21 May, 2015 14:18 IST|Sakshi
'మాంఝీ మాతో రండి'

పాట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమతో కలిసి రావాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీని ఆహ్వానించారు. సమాజ్‌వాదీ పార్టీ, జనతాదళ్ (యునెటైడ్), రాష్ట్రీయ జనతా దళ్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, జనతాదళ్ (సెక్యులర్), సమాజ్‌వాదీ జనతా పార్టీలు కలిసి జనతా పరివార్ గా ఏర్పడిన విషయం తెలిసిందే. దీనికి ములాయంసింగ్ యాదవ్ అధినేతగా ఉన్నారు. త్వరలోనే బీహార్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీని ఎదుర్కొనేందుకు కావాల్సిన అన్ని రకాల బలాలను సమీకరించేందుకు ఇప్పుడు జనతా పరివార్ శ్రమిస్తోంది.

కాగా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు మాంఝీ నిరాకరించిన నేపథ్యంలో ఆయనను జేడీయూ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆయన సొంతంగా హిందుస్థాని అవామ్ మోర్చా అనే రాజకీయ సంస్థను స్థాపించుకున్నారు. దీంతో ఆ సంస్థను కూడా తమతో చేర్చుకొని మరింత బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో లాలూ మాంఝీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు