జేసీ ట్రావెల్స్‌పై కేసుకు రంగం సిద్ధం

1 Nov, 2013 06:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర బస్సు దుర్ఘటన నేపథ్యంలో మాజీ మంత్రి జేసీ దివాకరరెడ్డికి సంబంధించి ట్రావెల్స్‌పై కేసు నమోదుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. 45 మంది మృతికి కారణమైన ఆ బస్సు దివాకర్ రోడ్ లైన్స్‌కు చెందినట్టుగా రవాణాశాఖ రికార్డుల్లో ఉన్నందున దానిపై కేసు నమోదు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఆ బస్సును రెండేళ్ల కిందటే జబ్బార్ ట్రావెల్స్‌కు విక్రయించామని, ఆ బస్సుతో తమకు సంబంధం లేదని జేసీ దివాకరరెడ్డి సోదరుడు జేసీ ప్రభాకరరెడ్డి మీడియాకు స్పష్టంచేసినా... రికార్డుల్లో ఎక్కడా జబ్బార్ ట్రావెల్స్ ప్రస్తావన లేదు. ఈ అమ్మకాలు, లీజు వ్యవహారాలను పట్టించుకోమని గురువారం రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పష్టం చేశారు. రికార్డుల్లో యజమాని పేరు ఎవరిది ఉందో వారిపైనే నిబంధనల ప్రకారం కేసు పెట్టాల్సి ఉంటుందని, ఆ నిబంధనలనే ఈ ప్రమాదం విషయంలోనూ అనుసరిస్తామని పేర్కొన్నారు.
 
 ఆ బస్సును జబ్బార్ ట్రావెల్స్‌కు అమ్మినందున దానితో తమకు సంబంధం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి చెబుతున్న నేపథ్యంలో కర్ణాటక ఆర్టీఏ పరిధిలో ఉన్న డాక్యుమెంట్లను ఇక్కడి అధికారులు తెప్పించుకున్నారు. వాటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ బస్సు దివాకర్ రోడ్ లైన్స్ పేరుతోనే ఉన్నట్లు అధికారికంగా ధ్రువీకరించుకున్నారు. ప్రమాద సమయంలో రెండో డ్రైవర్ లేకపోవడం, సామర్థ్యానికి మించి బస్సులో ప్రయాణికులు ఉండడం, బస్సు నడిపిన డ్రైవర్‌కు సరైన శిక్షణ లేకపోవడం.. తదితర కారణాల నేపథ్యంలో దివాకర్ ట్రావెల్స్‌పై తీవ్రమైన కేసులు నమోదయ్యే అవకాశం ఉందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. మరోవైపు కర్ణాటక రవాణా శాఖ అధికారులు కూడా గురువారం హైదరాబాద్ చేరుకొని ఈ ప్రమాదంలో వారి వైపు నుంచి కూడా దర్యాప్తు ప్రారంభించారు.
 
 నెపం రోడ్డుపై నెట్టే యత్నం: ప్రభుత్వ ఆదేశం ప్రకారం ప్రస్తుతం ఘటనపై ప్రాథమిక విచారణ జరుగుతోంది. ఆ నివేదిక వచ్చే వరకు వేచి చూడాల్సి ఉంది. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ బుధవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు రవాణా శాఖ సంయుక్త కమిషనర్ విచారణ ప్రారంభించారు. ఇక్కడే జేసీ అనుచరులు రంగప్రవేశం చేశారు. ఈ విచారణ వీలైనంత వరకు ఇతర అంశాలపై ఫోకస్ కావటం ద్వారా దివాకర్ రోడ్ లైన్స్ అంశం పైకి రాకుండా చూడాలనేది వారి ఉద్దేశం. ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఇప్పటికే అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చినా, ప్రమాదం జరిగినచోట రోడ్డూ లోపభూయిష్టంగా ఉన్నందున ప్రధాన కారణం రోడ్డేనని తేల్చేలా చూస్తున్నారు. బస్సులో వాస్తవానికి రెండో డ్రైవర్ లేనప్పటికీ.. ఉన్నాడని, మార్గమధ్యంలో అతడు దిగిపోయాడని నివేదికలో చేర్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. కర్ణాటక రవాణా శాఖ నిబంధనల్లో ఉన్న లొసుగుల ఆధారంగా బస్సు యాజమాన్యం విషయంలోనూ ఏమార్చే ప్రయత్నం జరుగుతున్నట్టు సమాచారం. అయితే నిబంధనల మేరకు పక్కాగా విచారణ జరిపి ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక ఇస్తానని విచారణాధికారి ప్రసాదరావు ‘సాక్షి’తో చెప్పారు.

>
మరిన్ని వార్తలు