అసహనంతో అరాచకం.. పేట్రేగిపోతున్న జేసీ సోదరులు

25 Nov, 2023 09:38 IST|Sakshi

రాజకీయాల్లో వివాదాలకు కేంద్రబిందువైన జేసీ బ్రదర్స్‌ (మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి – మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి) టీడీపీ అధికారం లేకపోయే సరికి సహనం కోల్పోతున్నారు. ప్రతిపక్షంలో  హుందాతనం కనబరచాల్సిన వీరు తద్భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దిగజారుడు రాజకీయాలతో విమర్శలు మూటగట్టుకుంటున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో అరాచకాలకు పాల్పడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: తాడిపత్రిలో 30 ఏళ్లకు పైగా అధికారంలో   ఉండి దొరతనాన్ని వెలగబెట్టిన జేసీ సోదరులు ప్రతిపక్షంలోకి వచ్చాక ఉనికి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. వీరు నిత్యం ఏదో ఒక వివాదంతో నియోజకవర్గంలో హైటెన్షన్‌ వాతావరణం సృష్టిస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా జేసీ ప్రభాకర్‌రెడ్డి చేష్టలకు సామాన్యులకే కాదు పోలీసులకు సైతం కంటిమీద కునుకులేకుండా ఉంది. ఇప్పటికే పలు అవినీతి కేసుల్లో ఉన్న ప్రభాకర్‌రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మరింతగా పేట్రేగిపోతున్నట్టు సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. 

అభివృద్ధి పనులను అడ్డుకుంటూ.. 
వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తాడిపత్రి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వీటినెలాగైనా అడ్డుకోవాలనేది జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆలోచన. ఇందులో భాగంగా ఆస్పత్రి నిర్మాణాలను అడ్డుకోవాలని కాంట్రాక్టర్‌ను బెదిరించారు. దీంతో ఈ నెల 23వ తేదీ వివాదం రాజుకుంది. జేసీ బెదిరింపులకు భయపడి కాంట్రాక్టర్‌ పనులు ఆపేసి వెళ్లినట్టు తెలిసింది. దీంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు ర్యాలీగా వెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. 

ఇది తొలిసారి కాదు... 
జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాస్పత్రి పనులను అడ్డుకోవడం మొదటి సారేమీ కాదు. మొన్నటికి మొన్న డ్రెయినేజీ పనులను అడ్డుకున్నారు. ఏకంగా మురికి కాలువలో కుర్చీ వేసుకుని కూర్చుని వివాదం రేపారు. అంతకుముందు ‘నాడు–నేడు’ పనుల కింద జూనియర్‌ కాలేజీకి ప్రహరీ నిర్మిస్తుంటే అడ్డుకున్నారు. అనుచరులతో కలిసి గొడవకు దిగారు. చివరకు పోలీసుల రక్షణలో ప్రహరీ పనులు చేపట్టాల్సి వచ్చింది. ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేసినా అడ్డుకుని రాద్ధాంతం చేశారు. చావుతప్పి కన్ను లొట్ట పోయిన చందంగా మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికై... వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు మున్సిపాలిటీలో అన్ని పనులకూ అడ్డు తగులుతున్నారు.  

అనుచరులను ఉసిగొలుపుతూ... 
గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవలేకపోయేసరికి జేసీ ప్రభాకర్‌రెడ్డి తీవ్ర అక్కసుతో ఉన్నారు. తన అనుచరులతో కలిసి ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం, ధర్నాలు, నిరసనలు చేపట్టడం, సామాన్యులను భయభ్రాంతులకు గురి చేయడం.. ఇదీ తాడిపత్రిలో రోజువారీ తీరు. గత నాలుగేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో మళ్లీ పల్లెలకు వెళ్లి వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. ఇదిలా ఉండగా జేసీ ప్రభాకర్‌ చేష్టలతో విసిగిపోయిన తెలుగుదేశం పార్టీ నేతలు ఎవ్వరూ ఈయనకు అండగా నిలవని పరిస్థితి. జేసీ సోదరులు టీడీపీకి గుదిబండగా మారారని అనంతపురానికి చెందిన ఆ పార్టీ నాయకుడొకరు చెప్పారు. వీరిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తే తప్ప తాడిపత్రిలో టీడీపీకి మనుగడ లేదంటున్నారు.  

జేసీ తీరుపై పోలీసుల మౌనం 
జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరురాలు కమలమ్మ ఫిర్యాదుపై స్పందించి కేసు నమోదు చేసిన పోలీసులు.. జేసీ అనుచరుల ఆగడాలపై మాత్రం కనీస స్పందన లేదు. ఇన్ని వివాదాలు సృష్టిస్తున్నా సుమోటోగా కేసు నమోదు చేయలేదు. జేసీ బెదిరింపులను, వివాదాలను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. పోలీసులు    ఎందుకు భయపడుతున్నారని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. 

కేసు నమోదుకు ఆదేశం 
కాంట్రాక్టర్లను బెదిరించిన తీరుపై బాధితులనుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేయాలని తాడిపత్రి పోలీసులను ఆదేశించాం. ఎవరినైనా బెదిరించినా, ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డు తగిలినా తీవ్రంగా పరిగణిస్తాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా వదిలే ప్రసక్తే లేదు. 
– అన్బురాజన్, ఎస్పీ    

మరిన్ని వార్తలు