రుద్రమదేవి’కి వినోదపన్ను మినహాయింపు

9 Oct, 2015 01:58 IST|Sakshi
రుద్రమదేవి’కి వినోదపన్ను మినహాయింపు

సీఎస్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు... దర్శకుడు గుణశేఖర్‌కు ప్రశంసలు

హైదరాబాద్: కాకతీయుల చరిత్ర, రాణీ రుద్రమదేవి జీవిత విశేషాలతో కూడిన అంశంతో నిర్మించిన రుద్రమదేవి చిత్రానికి వినోద పన్ను నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులివ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలకు తగిన ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. చిత్ర నిర్మాత దిల్ రాజు, చిత్ర దర్శకుడు గుణశేఖర్, ఆయన కుటుంబసభ్యులు గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు.

రుద్రమదేవి సినిమాను చూడాల్సిందిగా కేసీఆర్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, రుద్రమదేవి గొప్పతనాన్ని చిత్రీకరించినందుకు గుణశేఖర్‌ను సీఎం అభినందించారు. ఇలాంటి మరెన్నో చిత్రాలు నిర్మించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర చరిత్ర, ఇక్కడి రాజవంశీయుల గొప్పతనానికి సంబంధించిన కథాంశాన్ని ఎంచుకోవడం పట్ల దర్శక నిర్మాతను అభినందించారు. ఇలాంటి చిత్రాలను ప్రభుత్వం తప్పకుండా ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు