రన్నింగ్‌ ఒక్కటే మెదడుకు మంచిది

8 Jul, 2016 19:09 IST|Sakshi
రన్నింగ్‌ ఒక్కటే మెదడుకు మంచిది

న్యూయార్క్‌: మానవులు రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే తెలివితేటలు పెరుగుతాయని గ్రీకులు, రోమన్ల కాలం నుంచి వస్తున్న విశ్వాసం. ఈ విశ్వాసాన్ని శాస్త్ర విజ్ఞానపరంగా నిరూపించేందుకు గత రెండు దశాబ్దాలుగా న్యూరోసైన్స్‌పై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూ వస్తున్నారు. శారీరక వ్యాయామం చేయడం ద్వారా మెదడులోని కణాల అభివృద్ధికి తోడ్పడే ప్రొటీన్లు పెరుగుతాయని, కణాలు పెరగడం వల్ల మెదడులో జ్ఞాపక శక్తి పెరుగుతుందని శాస్త్రవేత్తలు ఇంతకాలం భావిస్తూ వచ్చారు.

ఇది పాక్షికంగా మాత్రమే నిజం. మెదడులో జ్ఞాపకశక్తి విస్తరించడానికి, కొన్ని ప్రత్యేక అంశాలపై దృష్టిని కేంద్రీకరించడానికి మెదడు కణాల్లో జరిగే జీవన క్రియను వైద్య పరిభాషలో హిప్పోక్యాంపస్‌ అని పిలుస్తాం. ఈ హిప్పోక్యాంపస్‌ ప్రక్రియ అభివృద్ధి చెందడానికి శారీరక వ్యాయామం తోడ్పడుతుందనే విషయం కూడా వాస్తవమే. అయితే ఎలాంటి వ్యాయామం వల్ల ఈ ప్రక్రియ అభివృద్ధి చెందుతుందనే విషయం ఇంతకాలం సంక్లిష్టంగా ఉంటూ వచ్చింది.

కొందరు యోగా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుందని, ఏరోబిక్స్‌ చేస్తే మెదడు క్రియాశీలకంగా మారుతుందని, జిమ్‌కెళ్లి వెయిట్‌ లిఫ్టింగ్‌ చేస్తే మెదడు కణాలు అభివృద్ధి చెందుతుందని, ఏరకమైన ఎక్సర్‌సైజ్‌ అయినా మెదడుకు మంచిదేనని రకరకాలుగా చెబుతున్న వారు ఎందరో ఉన్నారు. శరీరంలో కొవ్వు కరగడానికి, కండరాలు బలపడడానికి ఏ వ్యాయామమైనా సరిపోవచ్చుగానీ తెలివితేటలు పెరిగేందుకు తోడ్పడే మెదడు కణాల అభివృద్ధికి మాత్రం పరుగెత్తడం ఒక్కటే మార్గమని ఇటీవల జరిపిన రెండు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వాటిలో ఓ అధ్యయనాన్ని ఫిన్‌ల్యాండ్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించగా, మరో అధ్యయనాన్ని ‘సెల్‌ మెటబాలిజమ్‌’ తన తాజా సంచికలో వెల్లడించింది.

ఈ అధ్యయనాలు జరిపిన రెండు బృందాలు వేర్వేరుగా హెచ్‌ఐటీ, ఆర్‌టీ వ్యాయామాలు చేసిన వారిలోని మెదడు కణాల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేశారు. హెచ్‌ఐటీ అంటే హై ఇంటెన్సిటివ్‌ ఇంటర్వెల్‌ ట్రేనింగ్, అంటే ఏరోబిక్స్‌ లాంటి వ్యాయామాలు చేయడం, ఆర్‌టీ అంటే రిసిస్టెంగ్‌ ట్రేనింగ్, అంటే వెయిట్‌ లిఫ్టింగ్‌ లాంటి వ్యాయామాలు చేయడం. ఏరోబిక్స్‌ లాంటి వ్యాయామాలు చేసిన వారి మెదడు కణాలు స్వల్పంగా అభివృద్ధి చెందాయి. వెయిట్‌లిఫ్టింగ్‌ లాంటి వ్యాయామాలు చేసిన వారి మెదడు కణాల్లో ఎలాంటి మార్పు రాలేదు.

ఆ తర్వాత శాస్త్రవేత్తలు పరుగెత్తే వారి మెదడులో కలిగిన మార్పులను అధ్యయనం చేశారు. ఆశ్చర్యంగా వారిలో హిప్పోక్యాంపస్‌ ప్రక్రియ వేగవంతమై మెదడులోని కణాలు ఎంతో అభివృద్ధి చెందాయి. పాత కణాలు బలపడడమే కాకుండా కొత్త కణాలు కూడా పుట్టుకొచ్చాయి. ఈ పరిశోధనల ద్వారా పరుగెత్తడమే మెదడుకు మంచిదని, జ్ఞాపక శక్తి పెరిగి తెలివి తేటలుపెరుగుతాయని పరిశోధకులు నిశ్చితాభిప్రాయానికి వచ్చారు.

రోజూ పరుగెత్తే వారందరికి తెలివి తేటలు వాటంతట అవే వస్తాయనుకుంటే పొరపాటు. అలా అయితే పోటీల్లో పాల్గొనే రన్నర్లు అందరూ తెలివితేటలు కలిగిన వారై ఉండాలి. తెలివితేటలు అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన శక్తి మాత్రమే మెదడుకు సంక్రమిస్తుంది. ఆ శక్తిని ఉపయోగించి మనకు ఆసక్తి ఉన్న సబ్జెక్టులపై దృష్టిని కేంద్రకరిస్తే వాటిల్లో మన తెలివితేటలు పెరుగుతాయి.

మరిన్ని వార్తలు