రూపాయి135 పైసలు అప్ - 63.20 వద్ద ముగింపు

24 Aug, 2013 03:05 IST|Sakshi
రూపాయి135 పైసలు అప్ - 63.20 వద్ద ముగింపు

 ముంబై: ఆరు రోజుల వరుస పతనానికి బ్రేక్ వేస్తూ.. రూపాయి శుక్రవారం అనూహ్యంగా కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే ఏకంగా 135 పైసలు పెరిగి 63.20 వద్ద క్లోజయ్యింది. ఇంత స్థాయిలో పెరగడం ఈ ద శాబ్దంలో ఇది రెండోసారి. ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ గురువారం చేసిన వ్యాఖ్యలు రూపాయి బలపడటానికి దోహదపడ్డాయి. దేశీ కరెన్సీ గురువారం ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టం 65.56కి పడిపోయిన నేపథ్యంలో నిరాశావాదానికి లోనుకానక్కర్లేదంటూ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయంటూ ఆర్‌బీఐ ప్రకటించడం మార్కెట్ వర్గాలకు కాస్త భరోసా కల్పించాయి.
 
 శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 64.55తో పోలిస్తే పటిష్టంగా 64.30 వ ద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే, ఆ తర్వాత కనిష్ట స్థాయి 64.75కి కూడా తగ్గింది. కానీ చివర్లో 2.09 శాతం ఎగిసి 63.20 వద్ద ముగిసింది. 2009 మే 18 తర్వాత ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అప్పట్లో దేశీ కరెన్సీ 152 పైసలు (3.08 శాతం) ఎగిసింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో ప్రభుత్వరంగ బ్యాంకులు డాలర్లను విక్రయించి ఉంటాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ట్రేడింగ్ విభాగం హెడ్ ఆగమ్ గుప్తా తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో హెచ్చుతగ్గులను నియంత్రించడంపై ప్రభుత్వం, ఆర్‌బీఐ పట్టుదలగా ఉన్నాయనే భరోసాతో కార్పొరేట్లు కూడా డాలర్లను విక్రయించారని ఆయన పేర్కొన్నారు. స్పాట్ ట్రేడింగ్‌లో దేశీ కరెన్సీ 63.40-64.60 శ్రేణిలో తిరుగాడవచ్చని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.
 
 60-61కి పెరగొచ్చు..
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కరెంటు ఖాతా లోటు (క్యాడ్) 80 బిలియన్ డాలర్ల నుంచి 68 బిలియన్ డాలర్లకు తగ్గగలదని బ్రిటన్‌కి చెందిన బార్‌క్లేస్ బ్యాంక్ అంచనా వేసింది. భారత్ క్యాడ్‌ని పూర్తిగా భర్తీ చేసుకోగలదని పేర్కొంది. దీంతో వచ్చే 12 నెలల్లో రూపాయి విలువ 61 స్థాయికి కోలుకోగలదని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశీ కరెన్సీ 60 స్థాయికి పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. బంగారం సహా చమురుయేతర దిగుమతులు ద్వితీయార్థంలో దిగిరావడం ద్వారా క్యాడ్ గణనీయంగా తగ్గగలదని పేర్కొంది.

మరిన్ని వార్తలు