హజ్‌ యాత్రికులకు నౌకాయాన సదుపాయం

9 Jul, 2017 04:08 IST|Sakshi
హజ్‌ యాత్రికులకు నౌకాయాన సదుపాయం

- వ్యాక్సినేషన్‌ ప్రారంభించిన కేంద్రమంత్రి నఖ్వీ
- 2018 నుంచి కొత్త హజ్‌ పాలసీ


సాక్షి, హైదరాబాద్‌:
హజ్‌యాత్రికులకు నౌకాయాన సదుపాయం కల్పించేందుకు నౌకాయాన మంత్రిత్వ శాఖతో చర్చలు జరుగుతున్నాయని కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు. రాష్ట్ర హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ నాంపల్లి హజ్‌హౌస్‌లో హజ్‌యాత్రకు ఎంపికైనవారికి వాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించారు.

మంత్రి మాట్లాడుతూ 1994 వరకు హజ్‌యాత్రకు నౌకల ద్వారానే వెళ్లేవారని, అప్పట్లోనే ఒక నౌకలో ఒకేసారి దాదాపు 2 వేల మంది వరకు యాత్రికులు వెళ్లే అవకాశం ఉండేదన్నారు. వచ్చే ఏడాది నుంచి కొత్త హజ్‌ పాలసీ రానుందని, హజ్‌యాత్ర తక్కువ ఖర్చు, యాత్రికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం హజ్‌ కమిటీకి కేవలం రూ.కోటిన్నర కేటాయిస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల హజ్‌ కమిటీల కంటే తెలంగాణ హజ్‌ కమిటీ యాత్రికులకు సౌకార్యాలు కల్పించడంలో మొదటి స్థానంలో ఉందని చెప్పారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఎ షుకూర్, ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు