సీమాంధ్రులకూ హక్కులుంటాయి: వెంకయ్యనాయుడు

25 Nov, 2013 04:35 IST|Sakshi
సీమాంధ్రులకూ హక్కులుంటాయి: వెంకయ్యనాయుడు

సాక్షి, హైదరాబాద్: దేశ సమైక్యత, సమగ్రతను కాపాడాల్సిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల విభజనలో తన ఇష్టానుసారం వ్యవహరిస్తోందని బీజేపీ సీనియర్ నేత ఎం.వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సమైక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి చేస్తే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కులాలు, మతాలు, జాతుల పేరిట దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటోందని మండిపడ్డారు. గుజరాత్‌లో తలపెట్టిన సర్దార్ పటేల్ విగ్రహ ఏర్పాట్లపై ఆదివారమిక్కడ జరిగిన దక్షిణాది రాష్ట్రాల అధ్యయన గోష్టిలో ఆయన కీలకోపన్యాసం చేశారు. ‘రాష్ట్రాన్ని విభజించమంటే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. పోవాల్సిన వాళ్లు ఎలాగూ పాకిస్థాన్ వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లంతా భారతీయులే. వాళ్లందరికీ సమాన హక్కులుంటాయి. ఈ దేశంలో వాళ్లూ (సీమాంధ్రను ఉద్దేశించి)భాగమే. పక్షపాతం చూపకండి.
 
  స్నేహితుల్లా మెలిగేలా రాష్ట్రాన్ని విభజించండి’ అని హితవు పలికారు. ఈ సమావేశం సమైక్యతా విగ్రహ దక్షిణాది రాష్ట్రాల సమన్వయకర్త డాక్టర్ కె.లక్ష్మణ్ అధ్యక్షతన జరిగింది. ఇందులో గుజరాత్ రాష్ట్ర మంత్రులు సౌరభ్ పటేల్, ప్రదీప్ జడేజా, రజనీకాంత్ పటేల్, బాబూ భాయ్ బుఖారియా, కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఓం ప్రకాశ్ ధన్‌కడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, సీహెచ్ విద్యాసాగరరావు, బండారు దత్తాత్రేయ, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, పెన్నార్ గ్రూపు సంస్థల నేత నృపేందర్‌రావు, సినీ నిర్మాత నారా జయశ్రీదేవి, నటి జీవిత, రిటైర్డ్ ఐజీ గోపీనాథ్‌రెడ్డి, పారిశ్రామికవేత్త లక్ష్మీరాజం, రచయిత భారవి, సీహెచ్ హనుమంతరావు పాల్గొన్నారు.  
 
 బీసీల్లో చేర్చాలని కాపు నేతల వినతి
 కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న తమ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ కాపు రిజర్వేషన్ పోరాట సమితి నేతలు విష్ణుమూర్తి, సోము వీర్రాజు తదితరులు కిషన్‌రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు