వారం రోజుల గరిష్టం

7 Feb, 2014 01:13 IST|Sakshi
వారం రోజుల గరిష్టం

ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో స్టాక్ సూచీలు వారంరోజుల గరిష్టస్థాయిలో ముగిసాయి. గురువారం 20,358-20,080 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 50 పాయింట్ల లాభంతో 20,311 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. జనవరి 31 తర్వాత బీఎస్‌ఈ సూచీకి ఇదే గరిష్ట ముగింపు. ఒకదశలో 5,965 పాయింట్ల స్థాయికి పడిపోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ చివరకు 14 పాయింట్ల లాభంతో 6,036 పాయింట్ల వద్ద ముగిసింది. మూడురోజులుగా సెన్సెక్స్ 101 పాయింట్లు పెరగగలిగింది.

 అంతకుముందు ఏడు రోజుల్లో 1,100 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసింది. సూచీల్లో ఎక్కువ వెయిటేజీ వున్న ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఐటీసీ, హెచ్‌యూఎల్‌లు 2-3 శాతం మధ్య ర్యాలీ జరపడంతో తాజాగా మార్కెట్ వారంరోజుల గరిష్టాన్ని అందుకోవడం సాధ్యపడింది. ఆటో షేర్లు మారుతి, మహీంద్రాలు 2 శాతం మేర పెరగ్గా, పీఎస్‌యూ షేర్లు కోల్ ఇండియా 5 శాతం, ఎన్ ఎండీసీ 2.5 శాతం చొప్పున ఎగిసాయి.

 రియల్టీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. డీఎల్‌ఎఫ్, జేపీ అసోసియేట్స్ 2 శాతం  తగ్గాయి. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, బీఓబీ, పీఎన్‌బీలు 1-2.5 శాతం మధ్య క్షీణించాయి. కొద్ది రోజులగా కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు కాస్త నెమ్మదించింది. తాజాగా వీరు రూ. 10 కోట్ల విలువైన షేర్లను నికరంగా కొనుగోలుచేయగా, దేశీయ సంస్థలు రూ. 610 కోట్లు పెట్టుబడి చేసాయి.

 ఐటీసీ కౌంటర్లో షార్ట్ కవరింగ్
 గురువారం మార్కెట్ హఠాత్తుగా టర్న్ ఎరౌండ్‌కావడానికి సూచీల్లో 10% పైగా వెయిటేజి వున్న ఐటీసీ కౌంటర్లో షార్ట్ కవరింగ్ జరగడం కారణం. కవరింగ్‌ను సూచిస్తూ ఐటీసీ ఫ్యూచర్ కాంట్రాక్టు నుంచి 9.56 లక్షల షేర్లు కట్ అయ్యాయి. మొత్తం ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) 1.76 కోట్ల షేర్లకు తగ్గింది. రూ. 320 స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 1.06 లక్షల షేర్లు కట్‌కాగా, ఇదే స్ట్రయిక్ పుట్ ఆప్షన్లో 84 వేల షేర్లు యాడ్ అయ్యాయి.

ఈ కాల్ ఆప్షన్‌లో ఓఐ 2.06 లక్షలు, పుట్ ఆప్షన్లో 3.11 లక్షల షేర్ల వరకూ వుంది. రూ. 330 కాల్ ఆప్షన్లో మాత్రం 45 లక్షల షేర్లు యాడ్‌కావడంతో మొత్తం ఓఐ 6.97 లక్షల షేర్లకు పెరిగింది.  సమీప భవిష్యత్తులో ఈ షేరు రూ. 320పైన స్థిరపడగలిగితే రూ. 330 స్థాయిని సమీపించవచ్చని, తదుపరి అప్‌ట్రెండ్ జరగాలంటే రూ. 330 స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో అధిగమించాల్సివుంటుందని ఈ ఆప్షన్ డేటా పేర్కొంటోంది.

మరిన్ని వార్తలు