అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష

28 Aug, 2017 15:31 IST|Sakshi
అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష

- 20 ఏళ్ల కారాగారశిక్ష  విధించిన సీబీఐ కోర్టు
రోహ్‌తక్‌:
అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌధా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. రోహ్‌తక్‌ జైలులో చేపట్టిన ప్రత్యేక విచారణలో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జగ్‌దీప్‌ సింగ్‌.. తుది తీర్పును వెలువరించారు. ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్‌ దోషిగా ఇదివరకే నిర్ధారించిన కోర్టు.. ఆ మేరకు సోమవారం కఠిన శిక్షను ఖరారు చేసింది.

బోరున విలపించిన గుర్మీత్‌: తనకు 20 ఏళ్ల శిక్ష పడగానే డేరా చీఫ్‌ గుర్మీత్‌ సింగ్‌ ఒక్కసారిగా బోరున విలపించారు. తాను ఏ తప్పూ చేయలేదని, నిరపరాదినని ఏడుస్తూ జడ్జికి మొరపెట్టుకున్నారు. 

రంగురంగుల దుస్తులు మాయం: శిక్ష ఖరారైన తర్వాత గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌కు జైలులోనే  వైద్య పరీక్షలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఆయనకు సెల్‌ను కేటాయించి, శిక్షఖైదీలకు ఇచ్చే తెల్లటి దుస్తులను అందించారు. ఇన్నాళ్లూ కళ్లుమిరుమిట్లు గొలిపేలా రంగురంగుల దుస్తులేసుకున్న బాబా మరో 10 ఏళ్లపాటు వాటికి దూరంగా ఉండాల్సిందే.

శిక్షకు ముందు 10 నిమిషాలు: గతవారం సీబీఐ కోర్టు గుర్మీత్‌ను దోషిగా నిర్ధారించిన అనంతరం హరియాణా, పంజాబ్‌ రాష్ట్రాల్లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో శిక్ష ఖరారుకు సంబంధించిన విచారణ రోహ్‌తక్‌ జైలులోనే జరిగింది. జడ్జి జగ్‌దీప్‌ సింగ్‌ ఆదేశాల మేరకు అధికారులు జైలులోనే ఏర్పాట్లుచేశారు. చివరిసారిగా ఇరుపక్షాలూ చెరో 10 నిమిషాలు వాదించేందుకు జడ్జి అవకాశం కల్పించారు.

దేశానికి గుర్మీత్‌ ఎంతో సేవచేశారు:  డేరా బాబా గొప్ప సామాజిక సేవకుడని, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించైనా నిరపరాధిగా విడిచిపెట్టాలని లేదా శిక్షను తగ్గించాలని డిఫెన్స్‌ న్యాయవాది వాదించారు.
సీబీఐ వాదన: అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌కు 10 ఏళ్లు తక్కువ కాకుండా శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్‌ తరఫు న్యాయవాది జడ్జికి విన్నవించారు.

మరిన్ని వార్తలు