బీజేపీతో పొత్తువల్లే నాశనమయ్యాం!

26 Jul, 2016 11:42 IST|Sakshi
బీజేపీతో పొత్తువల్లే నాశనమయ్యాం!

ముంబై: బీజేపీతో గత 25 ఏళ్లుగా కొనసాగించిన పొత్తు వల్ల శివసేన పార్టీ బాగా చితికిపోయిందని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. చాలాకాలం నుంచి మిత్రపక్షాలుగా కొనసాగిన ఈ రెండు పార్టీలు 2014లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. పార్టీ అధికార ప్రతికలైన ‘సామ్నా’ (మరాఠీ), దోపహర్‌ కా ‘సామ్నా’ (హిందీ)కు ఉద్ధవ్‌ ఠాక్రే ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ-శివసేన పొత్తు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘25 ఏళ్లు అంటే రెండు తరాలు మనం చేతిలో చేయి వేసి ముందుకుసాగాం. మనం సొంతబలంతోనే ఎప్పుడో అధికారంలోకి వచ్చేవాళ్లం. కానీ బీజేపీతో పొత్తు వల్ల నాశనమైపోయాం’ అని ఠాక్రే పేర్కొన్నారు. మంగళవారం తన 56వ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఈ ఇంటర్వ్యూ ఇచ్చారు. జాతీయవాద దృక్పథంతో భావజాల ఐక్యత పరంగానే బాల్‌ ఠాక్రే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, ఇందులో ఎలాంటి ప్రేరణగానీ, స్వల్పకాలిక ప్రయోజనాలుగానీ లేవని, బాల్‌ ఠాక్రే ఎన్నడూ అధికారం కోసం పాకులాడలేదని చెప్పారు.

మరిన్ని వార్తలు