ఎంపీలో హ్యాట్రిక్ దిశగా చౌహాన్!

25 Oct, 2013 02:10 IST|Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్‌లో ముచ్చటగా మూడోసారి కూడా ‘కమలం’ వికసించే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ ఎన్నికలతో ‘హ్యాట్రిక్’ సాధించే అవకాశాలు ఉన్నట్లు పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. ఈసారి సీట్లు కొన్ని తగ్గినా, అధికారానికి కావలసిన సీట్లు బీజేపీకి సునాయాసంగానే వస్తాయని చెబుతున్నాయి. ఆర్థిక రంగంలో సాధించిన అభివృద్ధిని, సుపరిపాలనలనే ప్రచారాస్త్రాలుగా చేసుకుని బీజేపీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. పదేళ్లుగా ప్రతిపక్ష స్థానానికి పరిమితమైన కాంగ్రెస్‌కు ఈసారి కూడా అధికారం అందని ద్రాక్షగానే కనిపిస్తోంది.
 
 అయినప్పటికీ, ఇటీవల దంతెవాడ ప్రాంతంలో తమ పార్టీ నేతలపై జరిగిన మావోయిస్టుల దాడి నేపథ్యంలో సానుభూతిని సొమ్ము చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. మధ్యప్రదేశ్ జనాభాలో దాదాపు 55 శాతం ఉన్న అగ్రకులాలు, ఓబీసీలలో అత్యధికులు ఈసారి కూడా బీజేపీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉండటంతో, బీజేపీ గెలుపు నల్లేరుపై బండి నడకేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఓటర్లలో గిరిజనులు 19 శాతం, ముస్లింలు 10 శాతం ఇదివరకు కాంగ్రెస్ వైపు ఉండేవారు. పదేళ్ల కిందట ఈ వర్గాల్లోనూ పట్టు కోల్పోయిన కాంగ్రెస్, తిరిగి ఈ వర్గాలను ఆకట్టుకునే యత్నాలు చేస్తోంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఈసారి కూడా శివరాజ్‌సింగ్ చౌహాన్ కాగా, కాంగ్రెస్ ఇంతవరకు తన ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు.
 
 

రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నేతగా చక్రం తిప్పిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్‌సింగ్ ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా జాతీయ రాజకీయాల్లో మునిగిపోవటంతో రాష్ట్రంలో ఒక విధమైన నాయకత్వ శూన్యత కాంగ్రెస్‌ను పీడిస్తోంది. కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తేవాలని కాంగ్రెస్‌లోని ఒకవర్గం నేతలు భావిస్తున్నా, ఇంతవరకు అధిష్టానం ఈ అంశంలో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే.. రాష్ట్ర ఎన్నికల ప్రచార సారథిగా జ్యోతిరాదిత్యను ముందుకు తేవటంతో ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు.. ముఖ్యమంత్రి చౌహాన్ ‘లౌకిక’ ముద్ర కోసం కూడా తాపత్రయపడుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హజ్‌హౌస్‌కు శంకుస్థాపన చేయడం, ఈద్-ఉల్-ఫిత్ ్రవేడుకల్లో ముస్లిం టోపీ ధరించడం, ముఖ్యమంత్రి కన్యాదాన పథకం కింద ముస్లిం యువతులకూ పెళ్లిళ్లు చేయించడం వంటి చర్యల ద్వారా ముస్లిం ఓటర్లకు చేరువయ్యే యత్నాలు సాగిస్తున్నారు. ‘కాషాయ’ పార్టీకి ముస్లింలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయబోరని, వారు తమవైపే ఉంటారని కాంగ్రెస్ నేతలు చెబుతుండగా, బీజేపీ నేతలు వారి వాదనను తోసిపుచ్చుతున్నారు. చౌహాన్ పాలనలో రాష్ట్రంలోని ముస్లింలు కూడా హిందువులతో సమానంగా లబ్ధి పొందుతున్నారని, ఎన్నికల్లో వారు తమకే అండగా నిలుస్తారని చెబుతున్నారు.
 
 రాష్ట్రంలోని మొత్తం 230 స్థానాలలో 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం జనాభా గణనీయంగా ఉంది. రాజధాని భోపాల్ నగరం పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో 42 శాతానికి పైగానే ముస్లిం ఓటర్లు ఉన్నారు. ముస్లింల ప్రాబల్యం గల మిగిలిన స్థానాలను చూసుకున్నా, వాటిలో ప్రస్తుతం 60 శాతం స్థానాలు బీజేపీ అధీనంలోనే ఉన్నాయి. భోపాల్ ఉత్తర నియోజకవర్గం మాత్రమే కాంగ్రెస్ అధీనంలో ఉంది. ఆరిఫ్ అకీల్ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి ఈ సీటు బీజేపీకి దక్కుతుందా లేదా అనేదానిపైనే ఆసక్తి నెలకొని ఉంది. ఇదిలా ఉండగా, గత 2008 ఎన్నికల్లో బీజేపీ 21 స్థానాల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో మాత్రమే గెలుపొందింది.

 

మధ్యప్రదేశ్
 ఎన్నికల తేదీ: నవంబర్ 25
 ఓటర్ల సంఖ్య: 4.65 కోట్లు
 
 ప్రస్తుత అసెంబ్లీలో బలాబలాలు
 పార్టీ    సీట్లు
 బీజేపీ    143
 కాంగ్రెస్    71
 బీఎస్పీ    7
 భారతీయ జనశక్తి    5
 సమాజ్‌వాదీ పార్టీ    1
 స్వతంత్రులు    1
 మొత్తం    230
 


 

మరిన్ని వార్తలు