చర్మం ఒలిచేస్తున్నారు!

9 Mar, 2017 14:09 IST|Sakshi
చర్మం ఒలిచేస్తున్నారు!

వంద చదరపు అంగుళాల ధర లక్ష రూపాయలు..! ఇది చర్మం విలువ. మనిషి చర్మం, అందునా మహిళ చర్మం.. నేపాలీ మహిళ చర్మం విలువ!! భారతదేశంలోని ధనవంతుల సౌందర్య శస్త్ర చికిత్సలకు, కాలిన గాయాల సర్జరీలకు ఈ చర్మాన్ని ఉపయోగిస్తున్నారు. భారత కాస్మొటిక్‌ సర్జరీ మార్కెట్‌లో ఈ చర్మానికి రోజురోజుకూ ధర పెరుగుతోంది. కానీ అందుకు ఆరోగ్యవంతమైన, తెల్లని చర్మం కావాలి. దీంతో నేపాలీ యువతులు, మహిళల చర్మాన్ని నిలువునా ఒలుచుకుంటున్నారు. ఇప్పటికే నేపాలీల పేదరికాన్ని ఆసరాగా చేసుకొని అక్కడి మహిళలను వేశ్యలుగా మారుస్తూ అక్రమ రవాణా చేస్తున్న మాఫియా రాకెట్లు ఇప్పుడు ఈ కొత్తదందాకు వారినే బలిపశువులుగా వాడుకుంటున్నాయి. మహిళల చర్మాన్ని దౌర్జన్యంగా ఒలుచుకుని డబ్బు చేసుకుంటున్నారు. ఒళ్లు గగుర్పొడిపించే ఈ దారుణ దందా గుదించి సోమా బసు అనే ఫ్రీలాన్స్‌ జర్నలిస్ట్‌ నేపాల్‌ ఇండియాల్లో పర్యటించి పరిశోధించి వెలుగులోకి తీసుకొచ్చారు. తాజాగా ఒకవెబ్‌సైట్‌లో ప్రచురించిన ఈ పరిశోధనాత్మక కథనంలోని ముఖ్యాంశాలు ఇవీ.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)
నేపాల్‌ రాజధాని నగరం ఖట్మాండూలో థామెల్‌ ప్రాంతం రాత్రి 9 గంటలు దాటిన తర్వాత కళ్లు తెరుస్తుంది. అప్పుడిక అక్కడ ప్రతీదీ అమ్మకానికి సిద్ధంగా ఉంటుంది. నైట్‌ క్లబ్బులు వెలుగులీనుతుంటాయి. ఒకవిధంగా చెప్పాలంటే భారత విలాస పురుషులకు ఇదో చిన్న లాస్‌ వేగాస్‌ లాంటిది. ఇక్కడ చాలామంది ఏజెంట్లు ఉంటారు. వాళ్లలో 14-15 ఏళ్ల బాలురు కూడా ఉంటారు. వీధుల్లో మగ పర్యాటకులకు ఇక్కడి నైట్‌క్లబ్బుల్లో లభించే సేవల గురించి చెబుతూ వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ పార్లర్లలో నేపాలీ యువతులు, మహిళలు పురుషులకు కావాల్సిన సేవలు అందిస్తారు.

నైట్‌ క్లబ్బులు, మసాజ్‌ పార్లర్లలో వేశ్యలుగా..
నేపాల్‌లోని గ్రామీణ ప్రాంతాల యువతులు మహిళలు చాలామంది దుర్భర దారిద్ర్యంలో మగ్గుతున్నారు. వారి పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు ఏజెంట్లు వారిని వేశ్యలుగా మార్చి నైట్‌క్లబ్బులు, మసాజ్‌ పార్లర్లకు తీసుకొస్తారు. ఆ మహిళలు మొదటి మూడు నెలల జీతం ఆ ఏజెంట్లకు కమీషన్‌ కింద చెల్లించాలి. దక్షిణాసియా దేశాల నుంచి.. ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చే పురుషులు ఇక్కడ విటులు. యువతి కాస్త చక్కగా ఉంటే ఒక్కో 'సిటింగ్‌'కి రూ.5000 వరకూ చెల్లిస్తారు. కానీ కొం‍త కాలానికి చాలా మంది యువతుల శరీరాలు గాయాలతో మాసికలు పడిపోతాయి. ఇలా గాయాల మచ్చలున్నవారికి రూ.300 నుంచి రూ.500 దక్కడమే ఎక్కువ. ఇక ఆ మహిళలు కండోమ్‌ వాడాలని పట్టుపడితే అది కూడా ఇవ్వరు. అలాగే చాలా మంది నేపాలీ యువతులు మహిళలను భారతదేశంలోని కోల్‌కతా, ముంబై తదితర  ప్రాంతాల్లో వేశ్యావాటికలకు తరలించడం షరా మామూలే. అధికారిక మార్గాల నుంచి కాకుండా దొంగదారుల్లో ఈ యువతులను అక్రమ రవాణా చేస్తారు.

మాదక ద్రవ్యాల మత్తులో ముంచేసి..
ఈ పార్లర్లు, వేశ్యావాటికల్లో విటుల విపరీత పోకడలు, పైశాచిక కోరికలకు ఈ మహిళలు సహకరించడానికి వీలుగా మాదక ద్రవ్యాలు, మత్తు మందులు ఇచ్చి వారిని మంచానికి కట్టేస్తారు. ఆ మత్తు ప్రభావం నుంచి బయటపడి తెలివి వచ్చేసరికి ఈ మహిళల శరీరాలు గాయాతో నెత్తురోడుతూ ఉంటాయి. వీపు, పొత్తి కడుపు, తొడలు, అన్ని భాగాల్లో చర్మం లేకుండా గాయాలు తేరి ఉంటాయి. దీంతో వారు వెంటనే ప్రాణభయంతో పరుగులు పెడతారు. అవన్నీ విటులు వైశాచిక ఆనందం కోసం చేసిన గాయాలనే అనుకుంటారు. తమ కర్మకు తమనే నిందించుకుంటూ ఆ వృత్తిలోనే కొనసాగుతారు. కాకపోతే వారికి అంతకు ముందున్న డిమాండ్‌ ఉండదు. వారిలో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. వారి శరీరం నుంచి చర్మం ఒలుచుకున్నారని, నిర్దాక్షిణ్యంగా దోచుకున్నారని, దానిని అమ్ముకుని సొమ్ము చేసుకుంటారని! తర్వాత తెలిసినా వారు చేయగలిగింది ఏమీ లేదు.. మౌనంగా రోదించడం తప్ప!

తెల్ల చర్మానికి గిరాకీ ఎక్కువ
మనుషుల చర్మానికి.. ముఖ్యంగా తెల్లని మేని ఛాయ గల మహిళల చర్మానికి చాలా డిమాండ్‌ ఉంటుంది. ఓ 100 చదరపు అంగుళాల చర్మపు ముక్క ఢిల్లీ,  ముంబై నగరాల్లో రూ.50 వేల నుంచి రూ. లక్ష వరకూ పలుకుతుంది. ఆ చర్మాన్ని చిన్న చిన్న పాథలాజికల్‌ ల్యాబులకు అమ్ముతారు. అక్కడ చర్మం టిష్యూను శుద్ధి చేసి అమెరికాకు జీవ అవయవాలను సరఫరా చేసేందుకు లైసెన్సు ఉన్న పెద్ద ల్యాబులకు సరఫరా చేస్తారు. అందులో కొన్ని చాలా ప్రముఖ ల్యాబులు కూడా ఉన్నాయి. అమెరికాలో శుద్ధి చేసిన చర్మాన్ని అల్లోడెర్మ్‌ లేదా అలాంటి ఉత్పత్తులుగా అభివృద్ధి చేస్తారు. తిరిగి ఇతర దేశాలతో పాటు భారతదేశానికి ఎగుమతి చేస్తారు. వీటిని పురుషాంగ పరిమాణం పెంపు, మహిళల వక్షోజాల పరిమాణం పెంపు, పెదవులు సరిచేయడం, కాలిన గాయాలను సరిచేయడం వంటి శరీరాకృతి సౌందర్య, సౌష్టవాలను పెంపొందించే సర్జరీల్లో ఉపయోగిస్తారు. ఈ సర్జరీలకు ఇప్పుడు భారతదేశంలో గిరాకీ విపరీతంగా పెరుగుతోంది.

బాధితుల సమ్మతితోనూ చర్మం తీసుకుంటారు
గిరాకీ ఉండటంతో ఈమధ్య ఈ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. పురుషుల్లో చాలా మంది మద్యపానం, ధూమపానం చేస్తుంటారు కాబట్టి వారి కన్నామహిళల చర్మం, కిడ్నీలు ఎక్కువ ఆరోగ్యవంతంగా ఉంటాయి కాబట్టి మహిళలనే ఎక్కువగా ఇందు కోసం ఎంచుకుంటారు. పైగా నేపాలీ మహిళల చర్మం తెల్లగా ఉండటం వల్ల దాన్ని కాకాసియన్‌ జాతి వ్యక్తి చర్మంగా నమ్మించగలగడం సులభం. అందువల్ల కూడా వారు ఎక్కువగా బాధితులవుతున్నారు. కొందరు మహిళల నుంచి వారి సమ్మతితోనే చర్మం తీసుకుంటారు.  నిజానికి నేపాల్‌లో చాలా మంది పేదరికం, అప్పుల వల్ల కిడ్నీలు, చర్మం విక్రయించడం షరా మామూలుగా మారింది. మానవ అవయవాల విక్రయం నేపాల్‌లో చట్ట​ ప్రకారం నేరం. ఇండియాలో కూడా ఈ క్రయ విక్రయాలు నిషిద్ధం. అయితే రిజిస్టర్‌ చేసుకున్న అవయవ దాతల నుంచి మాత్రమే అవయవాలను, టిష్యూలను తీసుకోవచ్చు. దీంతో చర్మం తీసుకోవడానికి అటు నేపాల్‌లో ఇటు ఇండియాలో నకిలీ ధ్రువపత్రాలను కూడా తయారు చేస్తున్నారు.

ఏజెంట్లకు కాసుల వర్షం
కాస్మొటిక్ సర్జరీ కోసం చర్మం కాలసిన వారు ముందుగా ఇండియాలో లేదా నేపాల్‌లో ఒక ఏజెంటును సంప్రదిస్తారు. అవసరమైన చర్మపు రంగు, ఫొటో, సదరు వ్యక్తి రక్తపు గ్రూపు తదితర వివరాలతో పాటు నిజమైన కస్టమరో కాదో నిర్ధారించుకోవడానికి చికిత్సకు సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. రెండు రోజుల్లో శాంపిల్‌ చర్మాన్ని పంపిస్తారు. అడ్వాన్సుగా కొంత మొత్తం తీసుకుంటారు. "ఏ మహిళ చర్మం తీసుకుంటారో ఆ మహిళకు రూ.5,000 నుంచి రూ.10,000 చెల్లిస్తారు. ఆ చర్మం శాంపిల్‌ను పంపిన మొదటి ఏజెంటుకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకూ లభిస్తాయి. ఆ మహిళను భారత్‌ - నేపాల్‌ సరిహద్దుల వరకూ తీసుకెళ్తారు. అక్కడి నుంచి మరొక ఏజెంటు వారిని సరిహద్దు దాటించి ఇండియాకు తీసుకెళ్లి మూడో ఏజెంటుకు అప్పగిస్తారు. ఆ మూడో ఏజెంటు ఆమె నుంచి చర్మం ఒలిపించే ఏర్పాట్లు చేస్తాడు. ఆ చర్మాన్ని తాము దానం చేశామని, అమ్మలేదని సదరు మహిళ  ధ్రువపత్రాలపై సంతకం చేయాల్సి ఉంటుందని 40 ఏళ్ల  ట్రాఫికర్‌ ప్రేమ్‌ బాస్గాయ్‌ చెప్పాడు. నేపాల్‌లోని కాబ్రేపాలన్‌చౌక్‌ జిల్లాలో కిడ్నీలు విక్రయిస్తున్న కేసులో ఇతడిని గత ఏడాది అరెస్టు చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్నాడు.

బాధితులే ఏజెంట్లగా మారుతున్నారు
​కుసుమ్‌ శ్రేష్ఠ అనే మహిళ వయసు​ 40 ఏళ్లు. ఆమె ఖట్మాండుకు 62 కిలోమీటర్ల దూరంలోని నుకాకోట్‌ గ్రామంలో నివసిస్తున్నారు. తన చర్మాన్ని ఒక ఏజెంట్‌కు అమ్మారు. ఆ ఏజెంట్‌కు బలమైన నెట్‌వర్క్‌ ఉందని, ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సాహసిస్తే వారి కుటుంబాన్ని హింసిస్తారని భయం భయంగా చెప్పారు. నిజానికి చాలా కుటుంబాల వారు జీవనాధారం కోసం చిన్న చిన్న పనులు చేయడానికి ఏజెంట్ల మీద ఆధారపడతారు. అలా కిడ్నీలు, చర్మం అమ్ముకున్న బాధితులు కూడా ఆ తర్వాత ఏజెంట్లుగా మారుతున్న ఉదంతాలున్నాయి. ప్రేమ్‌ బాస్గాయ్‌ ఇలాగే ఏజెంటుగా మారాడు. తొలుత అతడు, అతడి భార్య తమ కిడ్నీలు అమ్ముకున్నారు. ఆ డబ్బులు అయిపోయాక ఇతరులను కిడ్నీలు అమ్మడానికి ఒప్పించి కమీషన్‌ తీసుకునే ఏజెంటుగా మారాడు.

ఎదురుతిరిగితే చంపేసి కాల్వలో తొక్కేస్తారు
కాబ్రేపాలన్‌చౌక్‌ జిల్లా నేపాల్‌లో కిడ్నీ బ్యాంకుగా పేరుపడింది. ఇక్కడి జనంలో చాలామంది కిడ్నీలు అమ్ముకున్న వారు ఉన్నారు. ఇక్కడి నుంచి దాదాపు 300 కిడ్నీలు అక్రమ రవాణా చేసినట్లు బయటపడినా కేవలం మూడు కేసులు మాత్రమే నమోదయ్యాయి. చర్మం విక్రయాల పరిస్థితి ఇంతే. ఈ రాకెట్‌ చాలా పకడ్బందీగా అనేక అంచెల్లో ఉండటం ఒక ఎత్తయితే ఆ విషయం ఎక్కడైనా బయటపెడితే తమతో పాటు తమ కుటుంబసభ్యులకు జరిగే ప్రాణహాని గురించిన భయం మరో ఎత్తు. దీంతో బాధితులు ఎవరూ ఎక్కడా నోరు విప్పడానికి ఇష్టపడరు. "ఎవరు ఫిర్యాదు చేస్తారు? అక్కడ ప్రాణానికి విలువ లేదు.

కస్టమర్లను సుఖపెట్టడానికి నిరాకరించిన మహిళలను, పారిపోవడానికి ప్రయత్నించిన వారిని చంపేసి మురుగుకాల్వల్లో తొక్కేసిన ఘటనలు నా కళ్లతో చూశాను. ఒక కస్టమర్‌ నా రెండేళ్ల కుమారుడి నాలుకను సిగరెట్లతో కాల్చాడు. నా కుమారుడికి ఇప్పుడు ఐదేళ్లు. అయినా ఇంకా సరిగ్గా మాట్లాడలేడు. ఈ కూపాల నుంచి మమ్మల్ని రక్షించి పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చినప్పుడు గతం గురించి మేం మాట్లడం. దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాం. అలాంటి భయానక సంఘటనలేవీ జరగలేదని మాకు మేము సర్దిచెప్పుకోవడానికి ప్రయత్నిస్తాం" అని రేఖ అనే మహిళ వివరించారు. ఆమె వయస్సు 30 ఏళ్లు దాటింది. ఆమె కిడ్నీని విక్రయించారు. ముంబై, కోల్‌కతాల్లోని వేశ్యావాటికలకు ఆమెను పంపించారు.

మరిన్ని వార్తలు