ఇక రోడ్లపై పరుగులు తీయనున్నడ్రైవర్ లేని కారు!

23 Mar, 2014 19:57 IST|Sakshi

లండన్: ఓ కారు వేగంగా దూసుకుపోతోంది.. అత్యంత చాకచక్యంగా వెళుతూ.. దానికదే దిశా నిర్దేశం చేసుకుంటూ పోతుంది. కొంతసేపటికి ఓ చోట ఆగింది.. కానీ, ఆ కారులో డ్రైవర్ లేడు! ఈ తరహా సన్నివేశాలు సినిమాల్లో తరచు చూస్తూ ఉంటాం. అయితే, ఇలాంటివి నిజంగానే మనకు అందుబాటులోకి వస్తే..ఎంతో అద్భుతంగా ఉంటుంది కదూ. అచ్చం మనుషుల్లా వ్యవహరించగల సరికొత్త రోబోటిక్ కార్లు వచ్చేయనున్నాయి. ఇందుకు తోడ్పడే అద్భుతమైన కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను బ్రిటన్‌కు చెందిన స్టిర్లింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ఆమిర్ హుస్సేన్ ఆధ్వర్యంలోని బృందం అభివృద్ధి చేసింది.

 

ఈ సందర్భంగా ప్రొఫెసర్ అమీర్ హుస్సేన్ మాట్లాడుతూ.. ‘‘లేన్లు మారడం, వేగం,  బ్రేకులు వేయడంతో పాటు కారును పార్క్ చేయడం వంటి పనులన్నింటినీ దాదాపు మనుషులు చేసినట్లుగా ఈ స్మార్ట్ కారు చేయగలదు. ఇంతవరకు వెళ్లని కొత్త దారుల్లో ప్రయాణించేటప్పుడు కూడా.. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తుంది. భవిష్యత్తు తరంలో రాబోయే డ్రైవర్ రహిత కార్లకు ఇది ఊతమిస్తుంది’’ అని పేర్కొన్నారు. మనుషుల్లా కొత్త విషయాలను నేర్చుకోగల సామర్థ్యాన్ని రోబోలకు కల్పించేదిశగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు.


 

>
మరిన్ని వార్తలు